ములుగు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ములుగు నియోజకవర్గంలో ప్రస్తుతం 303 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో రెండు పోలింగ్ కేంద్రాల స్థల మార్పు చేయనున్నట్లు, నాలుగు పోలింగ్ కేంద్రాల పేర్లను మార్చనున్నట్లు వెల్లడించారు. మరో ఐదు నూతన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దీంతో నియోజకవర్గంలో మొత్తం 308 పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పాటించాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ నెలవారి తనిఖీ చేపట్టారు. గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం సీల్‌ను పరిశీలించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఇతర భద్రతా పరికరాలను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పారదర్శకతను నిర్ధారించేందుకు ప్రతినెలా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాం తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
పారిశుద్ధ్యంపై కేంద్ర బృందం పరిశీలన
గ్రామాల్లో పారిశుద్ధ్య సేవల బలోపేతానికి కేంద్ర బృందం జిల్లాలోని చల్వాయి, మేడారం గ్రామాలలో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుందని కలెక్టర్ హేమంత్ సహదేవరావు తెలిపారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో స్వచ్ఛభారత్, మిషన్ గ్రామీణ కింద గ్రామీణ పారిశుద్ధ్య ఆస్తులు, సేవల నిర్వహణకు భవిష్యత్‌లో అవసరమయ్యే నిధుల అంచనాపై అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ బృందం, యూనిసెఫ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి అధ్యయనాలు దోహదపడతాయని తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అధ్యయన నివేదికను సమర్పించాలని బృందాన్ని కోరారు. సంబంధిత శాఖల సమన్వయంతో అధ్యయన బృందానికి అవసరమైన సహకారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటన నేటి(గురువారం) వరకు కొనసాగుతుందని వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.సంపత్‌రావు, కేంద్ర ఐఈజీ బృందం సభ్యులు డాక్టర్ నితీశ్ ఖన్నా, అనుకేత్, యూనిసెఫ్ రాష్ట్ర సమన్వయకర్త శ్రీహరి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


