ములుగు రూరల్: పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గడ్డం క్రాంతి కుమార్(కానిస్టేబుల్), ఉపాధ్యక్షులుగా తాజుద్దీన్(ఎస్సై), కృష్ణప్రసాద్(ఎస్సై), కార్యదర్శిగా సురేశ్(సీఐ), జాయింట్ సెక్రటరీగా నరేశ్(హెడ్ కానిస్టేబుల్), ఆర్గనైజింగ్ సెక్రటరీగా విజయ్(హెడ్ కానిస్టేబుల్), ట్రెజరర్‌గా సర్వేశ్వర్‌రావు(కానిస్టేబుల్), ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా అనిల్‌కుమార్, రాజీవ్, స్వప్న యాదవ్, శోభన్, తిరుపతి, శంకర్‌లు ఎన్నికయ్యారు. ఈ మేరకు కమిటీ సభ్యులు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నిజాయతీగా , పారదర్శకంగా పని చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల సంక్షేమం, పరస్పర సహకారంతో అసోసియేషన్ పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
ఎంపిక
మల్హర్: మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో కొడారి హిమజ అండర్–16 (జావెలిన్ త్రో), ఎల్లిపాయల శృతి అండర్ 18 (షాట్ ఫుట్), భూతం సాయి వర్షిని అండర్–14 కిడ్స్ (జావెలిన్), గాలి వర్షిత అండర్–12 (రన్నింగ్) విభాగాల్లో ఎంపికయ్యారు. బాలుర విభాగంలో అజ్మీర రాంచరణ్ (అండర్– 18) షార్ట్ ఫుట్, వేముల అభిరాం అండర్–18 రన్నింగ్, కుదురుపాక అండర్–18 రన్నింగ్ విభాగంలో ఎన్నికయ్యారు. ఈ నెల 7, 8 తేదీల్లో హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
10 నుంచి
నిరసన కార్యక్రమాలు
భూపాలపల్లి అర్బన్: బొగ్గు గని కార్మికుల 12వ వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, జేబీసీసీఐ సభ్యుడు మంద నరసింహారావు పిలుపునిచ్చారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుని 12వ వేతన ఒప్పంద కమిటీని వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ బీఈడీ (సీటీఈ) కళాశాలలో వివిధ సబ్జెక్టుల లెక్చరర్ల పోస్టుల ఖాళీల భర్తీలో భాగంగా ఫారిన్ సర్వీస్‌పై నియామకానికి మల్టీజోన్ –1నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూళ్ల జీహెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తు చేసుకున్న వారికి రాతపరీక్ష నిర్వహించి మెరిట్ లిస్టును ఈనెల 4న ప్రకటించిన విషయం విధితమే. 12 పోస్టులకు మెరిట్ సాధించిన 31మంది టీచర్లను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆహ్వానించారు. ఈ మేరకు హనుమకొండ ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఉపాధ్యాయుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇద్దరు గెజిటెడ్ హెడ్‌మాస్టర్లు, కళాశాల సిబ్బంది బుధవారం పరిశీలించారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌కు 17మంది టీచర్లు హాజరయ్యారని, మిగితా వారు గురువారం వచ్చే అవకాశం ఉందని జిల్లా క్వాలిటీ కోఆర్డి నేటర్ బండారు మన్‌మోహన్ తెలిపారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటీఎం తదితర కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 20, 22, 24, 27, 29, 31వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు.


