ములుగు రూరల్: సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఈ మేరకు బుధవారం స్టే అలర్ట్–స్టే అవేర్–స్టే సైబర్ సేఫ్ కార్యక్రమంలో భాగంగా ఎస్సై వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో డీఎల్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో సైబర్ భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డిజిటల్ యుగంలో సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కేవైసీ, డిప్‌ఫేక్, డిజిటల్ అరెస్టు, సోషల్ మీడియా, ఫేక్ ప్రొఫైల్స్ వంటి మోసాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు, ఓటీపీ, పిన్ వంటి వివరాలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దని సూచించారు. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకూడదని హెచ్చరించారు. ఇంస్ట్రాగామ్, ఫేస్‌బుక్ వంటి మాద్యమాల్లో అపరిచిత వ్యక్తులతో పరిచయాలను పెంచుకోకూడదని తెలిపారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, ములుగు సీఐ సురేశ్‌కుమార్, సీసీఎస్ సీఐ బండారి కుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు, పస్రా ఎస్సై తాజుద్దీన్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్


