● అదనపు కలెక్టర్ సంపత్ రావు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలో నిర్వహించే సభ ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి దిక్సూచిలా, నిజమైన ప్రజా వేదికగా మారాలని అదనపు కలెక్టర్ సంపత్ రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామ పంచాయతీలు సమగ్రాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. స్థానికంగా ఉన్న మౌలిక వసతుల కొరతతో పాటు ప్రజల నుంచి వస్తున్న వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలను ఈ నెల 15వ తేదీ లోపు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రతీ 45 రోజులకు ఒకసారి తప్పనిసరిగా మండల సభను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సభలకు మండల స్థాయి అధికారులు నేరుగా హాజరుకావాలని, తమకు బదులుగా కింది స్థాయి సిబ్బందిని లేదా ప్రతినిధులను పంపితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తెచ్చే సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. గ్రామాల్లో ప్రధానంగా విద్యుత్ సమస్య తలెత్తుతుందని, విద్యుత్ అధికారులకు ఎవరికి ఫోన్ చేసినా స్పందించడం లేదని ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్ భాష బోయిన పోశాలు విద్యుత్ అధికారులను నిలదీశారు. ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ కృష్ణ ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీవో రాజు, ఐబీ డీఈ రవీందర్ రెడ్డి, ఏఓ శైలజ, డాక్టర్ శ్రీకాంత్, ఎంఈఓ ప్రభాకర్, ఏపీఎం ధర్మేందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


