వెంకటాపురం(ఎం): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేదని, రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విశ్వతేజ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలను శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. వరి నార్లు పోసుకొని నాటు వేయని రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తల బృందం వెంకన్న, ఓంప్రకాష్, ప్రశాంత్‌కుమార్, ఏఓ శైలజ, ఏఈఓ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆహార అలవాట్లతోనే ఆరోగ్య సమస్యలు
ములుగు రూరల్: ప్రస్తుత సమాజంలో మానవుల ఆహార అలవాట్లతోనే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఎమ్మెన్నార్ కళాశాల ప్రొఫెసర్ సరేంద్రనెహ్రూ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మానవ జీవన శైలిలో మధుమేహం, హైపర్ టెన్షన్, కేన్సర్, గుండె జబ్బులు, మూత్ర పిండాలు పాడైపోవడం జరుగుతుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతున్న వ్యాధులను పరిశీలించాలన్నారు. వ్యాధులపై పరిశోధనలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు శారీరక శ్రమ తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని సూచించారు. రోగ నిరోధక శక్తిని పెంపొందిచుకొని వ్యాధుల బారిన పడకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి గోపాల్‌రావు, సతీష్, సుధీర్, శ్రీకాంత్, గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.
రామప్ప సందర్శన
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ మెంబర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హేమంత్‌కుమార్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళాసంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట రెవెన్యూ, టూరిజం శాఖ అధికారులు ఉన్నారు.
మొబైల్ డీటీఆర్ ట్రాలీ ప్రారంభం
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి సర్కిల్ పరిధిలో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరచడంలో భాగంగా నూతనంగా మొబైల్ డీటీఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్) ట్రాలీని భూపాలపల్లి డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఆ శాఖ జిల్లా ఎస్‌ఈ రమేశ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు అకస్మాత్తుగా కాలిపోయినప్పుడు లేదా ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినప్పుడు, ప్రత్యామ్నాయ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేసే వరకు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ మొబైల్ డీటీఆర్ ట్రాలీద్వారా తక్షణమే విద్యు త్ సరఫరాను పునరుద్ధరించవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ అంతరాయం సమయాన్ని గణనీయంగా తగ్గించి, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈట్రాలీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డివిజన్ కార్యాలయం అధికారులు పాల్గొన్నారు.
కాళేశ్వరం వద్ద
పెరిగిన గోదావరి
కాళేశ్వరం: మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నది వరద కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసి ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 5.750 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాటును తాకుతూ నీటిమట్టం ప్రవహిస్తోంది. దిగువన మేడిగడ్డ బరాజ్‌కు వరద నీరు చేరడంతో అక్కడ 22,290 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద ప్రవాహం రావడంతో మొత్తం 85 గేట్లు ఎత్తడంతో దిగువకు అదే స్థాయిలో అవుట్‌ఫ్లో తరలిపోతున్నట్లు ఇంజనీర్లు పేర్కొంటున్నారు.


