ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క పూజారి కొక్కెర కృష్ణయ్య ఉగాది పురస్కారానికి ఎంపియ్యారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే మహాజాతర సమయంలో చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణే రూపంలో అమ్మవారిని గద్దైపెకి సమ్మక్క పూజారులతో కలిసి కొక్కెర కృష్ణయ్య తీసుకొస్తారు. ఈ క్రమంలో క్రిష్ణయ్యను ప్రభుత్వం ఉగాది పురస్కారానికి ఎంపిక చేసింది. గురువారం ఆయన హైదరాబాద్‌లో సీఎం చేతుల మీదుగా పురస్కారం అందుకోవాల్సి ఉండగా అనివార్య కారణాలతో ఆయన హైదరాబాద్ వెళ్లలేకపోయారు. ఉగాది పురస్కారానికి ఎంపికై న కృష్ణయ్యను సమ్మక్క– సారలమ్మ పూజారులతో పాటు మేడారం గిరిజన అభ్యుదయ సంఘం యువకులు, స్థానిక ఆదివాసీలు, భక్తులు ఆయనకు అభినందనలు తెలిపారు.
ఉదయ భాస్కర్‌కు
అర్చక రత్న అవార్డు
గోవిందరావుపేట: బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన 18వ దక్షిణ భారత కాన్ఫరెన్స్‌లో మండల కేంద్రానికి చెందిన ప్రముఖ అర్చకుడు తిరుక్కోవల్లూరు ఉదయ భాస్కర్‌కు అర్చక రత్న అవార్డు ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక సేవా రంగంలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన పండితులు, సాహితీవేత్తలు, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొని, అర్చక వృత్తి పరిరక్షణలో ఉదయ్ భాస్కర్ చేసిన కృషిని ప్రశంసించారు. అనంతరం ఉదయ భాస్కర్ మాట్లాడుతూ అర్చక రత్న అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్చకుల స్థాయి పెంపు, వారికి అవసరమైన శిక్షణ, మద్దతు అందించాల్సి ఉందని వివరించారు.
రేపు ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి శ్యాంసుందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని కృష్ణాకాలనీ సీఈఆర్ క్లబ్‌లో ఏర్పాటు చేసే వైద్య శిబిరానికి ఆయుర్వేద స్పెషలిస్టు డాక్టర్ విశ్వనాధ మహర్షి హాజరుకానున్నట్లు తెలిపారు. చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, గుండెదడ, బీపీ, ఘగర్, థైరాయిడ్, మలబద్ధకం, అజీర్ణం, పక్షవాతం, ఆస్తమా, సీ్త్రలకు సంబంధించిన వ్యాధుల నివారణ కోసం వైద్య శిబిరం ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఉంటుందని తెలిపారు.
మల్హర్/మల్హర్(కాటారం): మండలంలోని కాటారం గ్రామానికి చెందిన విద్యారంగం, సామాజిక సేవలో నాలుగు దశాబ్దాలుగా విశిష్టసేవలు అందిస్తున్న ప్రముఖ విద్యావేత్త జనగామ కరుణాకర్‌రావుకు రాష్ట్రస్థాయి ఉగాది ఉత్తమ సేవారత్న పురస్కారం లభించింది. గురువారం జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో కరుణాకర్‌రావు రాష్ట్ర స్థాయి సేవారత్న పురష్కరాన్ని అందుకున్నారు. మల్హర్ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన సాయివాణి విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ వీరమేని సంపత్‌రావుకు రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార అవార్డు అందుకున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తదితరులు కరుణాకర్‌రావు, సంపత్‌రావులను అభినందించి, సత్కరించారు.


