బ్యాంకుల సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు రూరల్: బ్యాంకుల ఆర్థిక సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ జయప్రకాశ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవా విభాగం పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలోని సంక్షేమభవన్‌లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ డబ్బు–మీ హక్కుపై నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదేళ్లుగా ఆయా ఖాతాలలో ఉన్న పొదుపు సొమ్మును, ఇన్సూరెన్స్ ఖాతాలను క్‌లైయిమ్ చేసుకోవాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ శిబిరాలను నిర్వహిస్తుందని తెలిపారు. ఆర్థిక పరమైన, ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు శిబిరంలో బ్యాంక్ శాఖ, బీమా శాఖ అధికారులు సలహాలు, సూచనలు అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ వరంగల్ రీజినల్ మేనేజర్ సుబ్బారావు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ హైదరాబాద్ ప్రతినిధి ఉదయ్, యూనియన్ బ్యాంక్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ ఆంజనేయులు, డీసీసీబీ మేనేజర్ తిరుపతి, బీమా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.
లీడ్ బ్యాంక్ మేనేజర్ జయప్రకాశ్


