
వినాయక చవితి శోభ
9 రోజులు.. విశేష పూజలు
నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు షురూ
గోవిందరావుపేట/ఏటూరునాగారం: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజు ల పాటు జరగనున్నాయి. విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వహకులు మండపాలను డెకరేషన్ చేయడంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ మేరకు జిల్లాలోని 9 మండలాల పరిధిలో రెండు వేలకు పైగా గణపతుల మండపాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కిరాణ షాపుల్లో పూజా సామగ్రి కొనుగోళ్లతో సందడి వాతావరణం నెలకొంది.
నిర్వహణకు భారీగానే ఖర్చు
గ్రామాల్లోని సంఘాలు, యువజన సంఘాలు, కాలనీ అసోసియేట్‌లు, భక్త మండలీలు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న గణ నాథుడి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. విగ్రహాలతో పాటు ఏర్పాట్లు, నిర్వహణ ఖర్చులు సైతం భారీగానే పెరిగాయి. వినాయకుడి విగ్రహాల ధరలు సైతం గతం కంటే 20 శాతానికి పైగా ధరలు పెరిగినప్పటికీ అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి.
దుకాణాల్లో సందడి
దుకాణాల వద్ద పూజా సామగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. బుధవారం వినాయక చవితి కావడంతో చిన్న పిల్లలు సైతం బాల వినాయకుడిని ఇళ్లలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు పండుగను ఘనంగా జరుపుకునేందుకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో దుకాణాలు రద్దీగా మారాయి.
1వ రోజు భాద్రపద శుద్ధ చవితి రోజున వరసిద్ధి వినాయకుడిగా ఆవహన చేసి పూజించి, ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు.
2వ రోజు వికట వినాయకుడిగా ఆవాహన చేసి పూజలు చేసి, అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు.
3వ రోజు భాద్రపద శుద్ధ షష్టి రోజున లంబోదరుడిగా కొలుస్తారు.
4వ రోజు సప్తమి రోజున గజానన వినాయకుడిగా పూజించి చెరుకుగడలు నైవేద్యంగా సమర్పిస్తారు.
5వ రోజు అష్టమి రోజున మహోధర వినాకుడిగా పూజిస్తారు.
6న నవమి రోజున ఏకదంత వినాయకుడిగా కొలుస్తూ నువ్వులతో చేసిన పదార్థాలను సమర్పిస్తారు.
7న దశమి రోజున వక్రతుండ వినాయకుడిగా పూజించి అరటి మొదలైన పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు.
8న ఏకాదశి రోజున విఘ్నరాజ వినాయకుడిగా పూజించి సత్తుపిండిని సమర్పిస్తారు.
9వ రోజు భాద్రపద శుద్ధ ద్వాదశి రోజున దూ మ్రవర్ణ వినాయకుడిగా ఆవహన చేసి పూజించి నేతి అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
మండపాల ఏర్పాట్లు పూర్తి
పూజా సామగ్రి కొనుగోళ్లతో దుకాణాల్లో సందడి