
విద్యార్థులు లక్ష్యసాధనకు పాటుపడాలి
కన్నాయిగూడెం: విద్యార్థులు లక్ష్య సాధనకు నిరంతరం పాటుపడాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థుల చదువుపై ఆరా తీశారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తున్న విషయాలను తెలుసుకున్నారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. భోజన వసతిపై ఆరా తీసి మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్‌కు సూచించారు. అనుమతులు లేకుండా పాఠశాలకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మండల కేంద్రంలోని పీహెచ్‌సీని తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల గది, ల్యాబ్‌ను పరిశీలించారు. మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సీజన్‌లో వచ్చే మలేరియా, టైపాయిడ్, కలరా, డెంగీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రోగులకు నిరంతరం వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో హెచ్‌డీఎఫ్‌సీ, వృత్తి స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా కేంద్రీకృత అభివృద్ధి ప్రాజెక్టు కరపత్రాలను బ్యాంక్ జోనల్ అధికారి అమిత్ నాందేవ్‌తో కలిసి కలెక్టర్ విడుదల చేసి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పండించే పంటలను ఐపీఎం పద్ధతిలో పండించి మంచిరేటు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినవ్, మండల ప్రత్యేక అధికారి వెంకటనారాయణ, ఎంపీడీఓ సాజిదా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్, కోటయ్య, నరేష్, లక్ష్మయ్య, బ్యాంక్ జోనల్ హెడ్ కరుణాకర్ రెడ్డి, క్లస్టర్ హెడ్ రాజేశ్, మేనేజర్ ఆసీయా, గిరిధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర

విద్యార్థులు లక్ష్యసాధనకు పాటుపడాలి

విద్యార్థులు లక్ష్యసాధనకు పాటుపడాలి