
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో కూరగాయలు, మాంసం విక్రయాల మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్, మాంసం, చేపలు, చికెన్ మార్కెట్లు ఒకే దగ్గర ఉండడంతో ఇబ్బందికర పరిస్థితి ఉన్నందున వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డులో గల పశుసంవర్థకశాఖ కార్యాలయం సమీపంలో నాన్‌వెజ్ మార్కెట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నేడు (శుక్రవారం) పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరపనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ అదాలత్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెన్షన్, జీపీఎఫ్ కేసులు, ఖాతాల సమస్యలు చర్చించి పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆయా ఖాతా దారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవా లని కలెక్టర్ కోరారు.
మంగపేట: మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి(ఈఓ)గా రేవెల్లి మహేశ్ గురువారం బాధ్యతలను చేపట్టారు. ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ హనుమకొండలోని మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓగా బదిలీ అయ్యారు. భూపాలపలిలోని భక్తాంజనేయస్వామి దేవస్థానం ఆలయ ఈఓగా విధులు నిర్వహిస్తున్న మహేశ్‌కు లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో సత్యనారాయణ నుంచి అదనపు బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన మహేశ్‌కు అర్చకులు పవన్‌కుమార్, ఈశ్వర్‌చంద్, సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి