ఏటూరునాగారం: వర్షాలు, వరదల కారణంగా జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరీశ్ తెలిపారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజ్, ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్, కరకట్ట ప్రాంతాలను ఎస్పీ శబరీశ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద పెరిగి ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో ముంపు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం ముంపునకు గురైన వెంకట్రావుపల్లి గ్రామస్తులను కలిసి పరామర్శించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతి తగ్గేవరకు బయటకు వెళ్లకూడదని సూచించారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రజలు పోలీస్ శాఖ సహాయం తీసుకోవాలన్నారు. డయల్ 100కు కాల్ చేయాలని, అత్యవసర సేవలను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్‌కుమార్, కన్నాయిగూడెం ఎస్సై వెంకటేశ్ పాల్గొన్నారు.
వాజేడు: గోదావరి వరద ఉధృతితో మండలంలోని పలు చోట్ల రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాడు. మండల పరిధిలోని టేకులగూడెం చివరన 163 నెంబర్ జాతీయ రహదారి ముంపునకు గురి అయిన విషయం తెలిసిందే. వరద ఇంకా పెరుగడంతో రెండు రాష్ట్రాల మధ్యరాక పోకలు నిలిచిపోయాయి. దీంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వచ్చి వెళ్లే లారీలు రెండు వైపుల భారీ స్థాయిలో నిలిచి పోయాయి. ఏడ్జెర్లపల్లి– పూసూరు, పేరూరు–కృష్ణాపురం, జాతీయ రహదారి నుంచి కోయవీరాపురం, వాజేడు– గుమ్మడి దొడ్డి, పెద్ద గొళ్లగుడెం– శ్రీరాంనగర్ గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచి పోయాయి. కృష్ణాపురంతో పాటు మరి కొన్ని గ్రామాల్లో గోదావరి వరదతో పొలాలు నీట మునిగాయి. అలాగే పేరూరు వద్ద బుధవారం సాయంత్రం 17.460 మీటర్ల నీటిమట్టం ఉంది.
వెంకటాపురం(కె): వర్షాకాలంలో కాచి చలార్చిన నీటినే తాగాలని ఏటూరునాగారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కోరం క్రాంతికుమార్ అన్నారు. మండలంలో ఆయన బుధవారం పర్యటించారు. చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు వండుతున్న కూరగాయలు, సామగ్రితో వంట గదిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. పొడిబట్టలనే ధరించాలని సూచించారు. భోజనం చేసే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. వారి వద్ద నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బాబురావు, వైద్యాధికారులు అశీష్, పవన్, వైద్య సిబ్బంది కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి