
మేడారంలో పొట్ట పండుగ
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో సమ్మక్క పూజారులు పొట్ట పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. మాఘ కార్తె సందర్భంగా అమ్మవార్లకు పొట్ట పండుగ పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు బుధవారం నుంచి మేడారంలో పొట్ట పండుగ పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఉదయాన్నే సమ్మక్క గుడిని పూజారులు శుద్ధి చేశారు. అమ్మవార్ల శక్తి పీఠాన్ని మట్టితో అలకరించి ఆడపడుచులు ముగ్గులు వేశారు. మామిడి ఆకుల తోరణాలు కట్టారు. బుధవారం సాయంత్రం సమ్మక్క పూజారి సిద్ధబోయిన ముణింధర్ ఇంటి వద్ద నుంచి అమ్మవార్లకు కంకణాలు, పసుపు, కుంకుమలు తీసుకుని పూజారులు డోలి వాయిద్యాలతో సమ్మక్క గుడికి వెళ్లారు.
గుడి నుంచి గద్దెల వద్దకు..
సమ్మక్క పూజారులు బుధవారం రాత్రి గుడిలో అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అర్థరాత్రి సమయంలో గుడి నుంచి పసుపు, కుంకుమ, పూజా సామగ్రిని తీసుకుని అమ్మవారి రూపంలో సమ్మక్క గద్దె వద్దకు డోలివాయిద్యాలతో పూజారులు వెళ్లారు. పూజారులు వెళ్తున్న దారిలో ఆదివాసీ అడపడుచులు ఎదురెళ్లి నీళ్లు ఆరగించారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. బూర కొమ్ములు, డోలివాయిద్యాలతో పూజారులు అట్టహాసంగా గద్దెల వద్దకు వెళ్లారు. సమ్మక్క– సారలమ్మ గద్దెల వద్ద తల్లులకు పూజా సామగ్రి ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు రాత్రంతా జాగారాలతో సంబురాలు నిర్వహించారు.
నేడు పూజా సామగ్రితో గుడికి
గురువారం ఉదయం పొద్దు పొడవక ముందే గద్దెల వద్ద నుంచి అమ్మవారి పూజా సామగ్రి తీసుకుని గుడికి చేరుకుంటారు. కొత్తగా పండిన ధాన్యాలను(మొక్కజొన్న కంకులను) అమ్మవారికి నైవేధ్యంగా సమర్పించి పూజలు చేస్తారు. సమ్మక్కతల్లికి యాటను బలిస్తారు. ఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు ముణిందర్, కొక్కెర కృష్ణయ్య, మల్లెల సత్యం, దూప వడ్డె నాగేశ్వర్‌రావు, సిద్ధబోయిన భోజరావు, రమేష్, నర్సింగరావు, వసంతరావు, సిద్ధు, ఆదివాసీ యువకులు పాల్గొన్నారు.
సంప్రదాయంగా వనదేవతలకు పూజలు
సమ్మక్క గుడి నుంచి గద్దెల వద్దకు
రాత్రంతా జాగారంతో
పూజారుల సంబురాలు

మేడారంలో పొట్ట పండుగ