
రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఏటూరునాగారం: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలోకి వరద నీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను బుధవారం జారీ చేసినట్లు కలెక్టర్ టీఎస్.దివాకర వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు, ఉదయం 11 గంటలకు గోదావరి వరద ఏటూరునాగారం మండలం రామన్నగూడెం లో 14.83 మీటర్లకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక, 15.83 చేరడంతో రెండో ప్రమాదహెచ్చరికను జారీ చేసినట్లు తెలిపారు. అనంతరం కన్నాయిగూడెం మండలంలో 33 కుటుంబాల వారిని, గోవిందరావుపేట మండలంలోని రెండు కుటుంబాల వారిని , ఏటూరునాగారం మండలంలో 50 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. జిల్లాలో 8 పునరావాస కేంద్రాలలో 75 కుటుంబాలకు చెందిన 216 మందిని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. జిల్లాలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఇప్పటికే బృందాలను సిద్ధంగా ఉంచామని వారితోపాటు జిల్లా పోలీసు యంత్రాంగం అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వీయ రక్షణకు అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18004257109 కు కాల్ చేయవచ్చని కలెక్టర్ వివరించారు.