
వదలని వాన.. వీడని వరద
జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం
ఏటూరునాగారం: జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోని బ్యారేజీల నుంచి నీరు భారీగా వస్తుండడంతో గోదావరి నది ఉరకలేస్తోంది. గంట గంటకు నీటిమట్టం పెరుగుతుండడంతో లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో జంపన్నవాగు, జీడివాగు, ఎర్రవాగు ఉప్పొంగి ఇళ్లలోకి నీరు చేరి ఆస్తినష్టం జరిగింది. మంగపేట మండల పరిధిలోని కమలాపురంలో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఏటూరునాగారంలోని ఎస్సీ కాలనీలో నిల్వ ఉన్న వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది జేసీబీతో గండ్లు కొట్టించి నీటిని బయటకు పంపించారు.
పెరుగుతున్న గోదావరి
ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం 13.90కి చేరింది. 14.83 మీటర్లకు వస్తే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసి లోతట్టు ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఎస్సారెస్పీ నుంచి నీటి ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని ఏటూరునాగారంలోని ఓడవాడ, ఎస్సీ కాలనీ ప్రజలను ముందస్తుగా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించడానికి జిల్లా, మండల అధికారులు సిద్ధమయ్యారు. రామన్నగూడెం గోదావరి వద్ద అధికారులు నిత్యం అందుబాటులో ఉండి వరద పరిస్థితిని గమనిస్తున్నారు.
పొలాల్లో ఇసుక మేటలు
ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో సుమారుగా 450 ఎకరాల మేర పంట పొలాల్లో ఇసుక మేటలు వేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గోగుపల్లి, శివాపురం, చిన్నబోయినపల్లిలోని వట్టివాగు ఉప్పొంగి చిన్నబోయినపల్లికి చెందిన దుమ్మని రాజేశ్వరి సాగు చేస్తున్న 8 ఎకరాల వరిపంట మొత్తం కొట్టుకుపోయింది. విద్యుత్ మోటారు, స్టాటర్ సైతం నీటి పాలు అయ్యింది. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేస్తే పంట కొట్టుకుపోయిందని రాజేశ్వరి, మరో రైతు శ్రీకాంత్‌లు బోరున విలపించారు.
కొట్టుకుపోయిన రోడ్లు.. తేలిన కంకర
మండలంలోని శివాపురం వెళ్లే ప్రధాన రోడ్డు కొట్టుకుపోయింది. వట్టివాగు, గోగుపల్లి వాగు వరద రోడ్డుపై నుంచి ప్రవహించడంతో బీటీ కొట్టుకుపోయి రాళ్లు తేలాయి. ఇవేకాకుండా జీడివాగు వద్ద గోతులు పడ్డాయి. మంగపేట మండలం బోరు నర్సాపురం, దొంగెల ఒర్రె, కమలాపురం ఎర్రవాగు సమీపంలో పలు రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో ఇళ్లలోని వస్తువులు, నిత్యావసర వస్తువులు సైతం కొట్టుకుపోయాయి.
పాఠశాలలకు సెలవు
ఏటూరునాగారం, మంగపేట ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో మంగళవారం విద్యాసంస్థలకు అధికారులు సెలవును ప్రకటించారు. దీంతో విద్యార్థులు ఇంటికే పరిమితం అయ్యారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలకు సైతం సెలవును యాజమాన్యాలు ప్రకటించాయి.
వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు
పలు గ్రామాల్లో నేలకూలిన ఇళ్లు
ధ్వంసమైన రహదారులు
పునరావాస కేంద్రాలకు తరలింపు

వదలని వాన.. వీడని వరద

వదలని వాన.. వీడని వరద

వదలని వాన.. వీడని వరద