
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి కలెక్టర్ దివాకర దంపతులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను ఈఓ ఘనంగా స్వాగతించారు. కలెక్టర్ దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు మహాదాశీర్వచనం అందజేశారు. అలాగే గంగుల శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీ దంపతులు దేవాలయంలో నిర్వహించే నిత్యాన్నదానం కోసం రూ.25 వేలు విరాళంగా అందజేశారు. రుసుముకు సంబంధించిన రశీదును దాతకు ఈఓ అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పర్యవేక్షకులు జి.క్రాంతికుమార్, ధర్మకర్తలు పాల్గొన్నారు.
ఇంటెక్‌వెల్ వద్ద వరద ఉధృతి పరిశీలన
మంగపేట: మండలంలో గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో మండల కేంద్రంలోని పొదుమూరు, కమలాపురం ఇంటెక్ వెల్ వద్ద గోదావరి వరద ఉధృతిని మండల స్పెషలాఫీసర్ సిద్ధార్థరెడ్డి, ఎంపీడీఓ భద్రునాయక్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాలైన పొదుమూరు, దేవనగరం, కత్తిగూడెం, అకినేపల్లి మల్లారం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయా పంచాయతీల కార్యదర్శులను ఆదేశించారు.
వైద్యశాలకు గర్భిణుల తరలింపు
వెంకటాపురం(కె): మండల పరిధిలోని టేకులబోరు, ముకునూరు పాలెం, వీరభద్రవరం గ్రామాలకు చెందిన గర్భిణులను మంగళవారం ఏటూరునాగారం వైద్యశాలకు 108 వాహనంలో తరలించారు. వర్షాలు, వరదల కారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో డెలివరీకి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏటూరునాగారం వైద్యశాలకు గర్భిణులను తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో కోటి రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
7,46,381 క్యూసెక్కుల నీరు రాక
కన్నాయిగూడెం: గోదావరికి ఎగువన కురుస్తున్న వర్షాలతో మండలంలోని తుపాకులగూడెం గ్రామ పరిధిలోని సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద గోదావరి క్రమక్రమంగా పెరుగుతోంది. బ్యారేజీలోకి సోమవారం 4 లక్షల క్యూసెక్కుల నీరు రాగా ఎగువన ఉన్న సరస్వతీ, లక్ష్మీ బ్యారేజీతో పాటు ఎగువ నుంచి గోదావరిలోకి 7,46,380 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు బ్యారేజీ 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ నీటిమట్టం 83 మీటర్ల సామర్థ్యం కాగా ప్రస్తుతం 82.35 మీటర్ల నీటిమట్టం ఉంది.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
ములుగు రూరల్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జిల్లాకేంద్రంలో రామప్ప ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లూయిస్ డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఫొటోగ్రాఫర్లను లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాస్ ఫొటో స్టూడియో టీం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు రమేష్, రవీందర్‌రెడ్డి, భద్రి, రాజు, రవీందర్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారికి కలెక్టర్ దంపతుల పూజలు

అమ్మవారికి కలెక్టర్ దంపతుల పూజలు