
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు బంద్
వాజేడు: మండల పరిధిలోని టేకులగూడెం గ్రామ సమీపంలో 163నంబర్ జాతీయ రహదారిపైకి మంగళవారం గోదావరి వరద వచ్చి చేరింది. దీంతో తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్యన రాక పోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద క్రమేపీ పెరుగు తుండటంతో రేగుమాకు ఒర్రె నుంచి రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. అప్రమత్తమైన అధికారులు వరదలోకి వెళ్లకూడదని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అధికారులు వరద పరిస్థితిని పరిశీలించారు. ముంపునకు గురైన జాతీయ రహదారిని వెంకటాపురం(కె) సీఐ ముత్యం రమేష్, పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీకాంత్ నాయుడు పరిశీలించారు. వాహనదారులు నీటిలో నుంచి వెళ్లకుండా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. పలువురు గోదావరి వరద జాతీయ రహదారిని ముంచిన విషయం తెలియక అక్కడికి చేరుకున్న రెండు రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. లగేజీ మోసుకుంటూ వరదలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ఓ లారీ వరదలో నుంచి రావడంతో దాని పక్క నుంచి ద్విచక్రవాహనాలను దాటించారు.
టేకులగూడెం వంతెన మూసివేత
ములుగు రూరల్: గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ– ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అనుసంధానం చేస్తున్న 163వ జాతీయ రహదారిపై టేకులగూడెం వంతెన మూసివేసినట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలో కురిసిన భారీ వర్షం కారణంగా టేకులగూడెం శివారులో రేగుమాగువాగు పొంగి ప్రవహిస్తుండగా ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నట్లు పలువురు తెలిపారు. వంతెన వద్ద పేరూరు పోలీసులు బారికేడ్‌లు ఏర్పాటు చేసి వంతెనను మూసివేశారు. వరద కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా ప్రయాణించాలని ఎస్పీ సూచించారు.

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు బంద్

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు బంద్

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ మధ్య రాకపోకలు బంద్