ఎస్‌ఎస్‌తాడ్వాయి: వరదలో చిక్కుకున్న నలుగురి ప్రాణాలను ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం️ కాపాడింది. ఈ ఘటన మండల పరిధిలోని కాల్వపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వపలి్లకి చెందిన పశువుల కాపారి దుబారి రామయ్య పశువులను మేతకు తోలుకుని సోమవారం సమీప అటవీ ప్రాంతానికి వెళ్లారు. అదే విధంగా గ్రామానికి చెందిన సాయికిరణ్, రాజబాబు, రాములు చేపల వేటకు వెళ్లారు. సోమవారం సాయంత్రం వరకు కూడా వారు ఇంటికి తిరిగి రాలేదు. ఇదే క్రమంలో తూముల వాగు వరద ప్రవాహం పెరగడంతో వారి కుటుంబ సభ్యులు అందోళకు గురయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న తాడ్వాయి తహసీల్దార్ సురేష్‌బాబు కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు సోమవారం రాత్రి 11 గంటలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందానికి సమాచారం అందించడంతో ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ నేతృత్వంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం వాగు ప్రాంతానికి చేరుకుంది. వాగులో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పశువుల కాపరి రామయ్యను తాడు సాయంతో బయటకు తీసుకువచ్చారు. చేపల వేటకు వెళ్లిన మరో ముగ్గురి కోసం వాగులో కిలోమీటర్ మేర వెళ్లి గాలించగా ఆచూకీ లభించడంతో ఆ ముగ్గురిని సురక్షితంగా వరదలో నుంచి వాగు దాటించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించిన అధికారులను, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందానికి బాధిత కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ ఏఎస్సైలు సుధీర్, సురేందర్, హెడ్ కానిస్టేబుళ్లు చంద్ర, రమేష్, కానిస్టేబుల్ ఆనంద్, రమణమూర్తి, విశాల్ పాల్గొన్నారు.