
మూడురోజులు అప్రమత్తంగా ఉండాలి
ఐటీడీఏలో కంట్రోల్ రూమ్
ఏటూరునాగారం: రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సూచించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాబోయే 3 రోజుల్లో ప్రత్యేక అధికారులు విద్యా సంస్థలను సందర్శించి నివేదికలు అందజేయాలని సూచించారు. ఫుడ్ పాయిజనింగ్ కాకుండా ఎస్‌ఓపీ మార్గదర్శకాలను అమలు చేయాల్సి ఉందని వివరించారు. జీసీసీతో సమన్వయం చేసుకొని స్టాక్ ప్రొవిజన్ లోటు పాట్లను సరిచేయాలన్నారు. ఐటీడీఏ డీడీ పోచం, గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్, డీటీడీఓలు ముందస్తు అనుమతి లేకుండా హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యూలు, ప్రిన్సిపాల్స్ పిల్లలతో చేయించే సాంస్కృతిక కార్యక్రమాలను వెంటనే నిలిపివేయాలని సూచించారు.
గైర్హాజర్ అయితే చర్యలు తప్పవు
అధికారులు గిరిజన విద్యాసంస్థల్లో తనిఖీలు చేసే సమయంలో పాఠశాలల అధికారులు, సిబ్బంది అనధికారికంగా, తెలియకుండా గైర్హాజరైతే చర్యలు తీసుకోవాలని అధికారులకు పీఓ తెలిపారు. శిథిలమైన భవనంలో ఏదైనా పాఠశాల ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థుల భద్రతకు అవసరమైతే శిథిలమైన వాటిని తొలగించడానికి ఇంజనీరింగ్ విభాగానికి సమాచారం ఇవ్వాలని వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం, స్తంభాలు పడిపోవడం, కరెంటు షాక్ సమస్యలు వంటివి ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి మరమ్మతులు చేయించుకోవాలని వెల్లడించారు. అదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన విద్యాసంస్థల కోసం డీడీలు, డీటీడీఓలు, ఆర్‌సీఓలు, హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యూఓలు, ప్రిన్సిపాల్స్ కోఆర్డినేషన్ కోసం జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు పీఓ చిత్రామిశ్రా వివరించారు.
వరద సమయంలో ఆపద, విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను ఆదుకునేందుకు హెల్ప్‌లైన్ నంబర్ 08717293246, ఐటీడీఏ హెల్త్ ఎమర్జెన్సీ నంబర్ 9912441123 కు సమాచారం ఇస్తే వైద్య సదుపాయలు వెంటనే అందుతాయని వివరించారు. అధికారులు రాబోయే 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, అన్ని అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని పీఓ కోరారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో
ఆకస్మిక తనిఖీలు
అనుమతిలేకుండా గైర్హాజరైతే చర్యలు
‘సాక్షి’తో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా