
పలు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన
ఏటూరునాగారం/ఎస్‌ఎస్ తాడ్వాయి/మంగపేట: ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉధృతిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క పరిశీలించారు. కరకట్టపై నడుచుకుంటూ కరకట్టను చూశారు. వరద పరిస్థితిని ఏటూరునాగారం తహసీల్దార్ జగదీశ్వర్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలంలోని మేడారం జంపన్నవాగు, ఊరట్టం తూముల వాగు వరదలను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా ఊరట్టం రైతులు వాగుల వదరలతో పంటలు నీటమునిగిపోతున్నాయని కరకట్టలు నిర్మించాలని మంత్రి సీతక్కను కోరగా సానుకూలంగా స్పందించారు.
మంగపేట మండల పరిధిలోని కమలాపురంలోని ఇందిరానగర్, భగత్‌సింగ్‌నగర్ ప్రాంతాలను సీతక్క పరిశీలించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పునరవాసా కేంద్రంలో ఉన్న బాధితులను పరామర్శించి పండ్లు, బెడ్‌షీట్లను పంపణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ క్లౌడ్ బరస్ట్ కారణంగా జిల్లాలోనే మంగపేటలోనే అత్యధికంగా వర్షం పడిందని తెలిపారు. భారీ వర్షం కారణంగా కమలాపురంలో 20 నుంచి 25 వరకు ఇళ్లు ముంపునకు గురికావడంతో కొంత మేర నష్టం జరిగిందని ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని భరోసా కల్పించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులు అందజేస్తామని తెలిపారు.