
ఇసుక మేటలు
మంగపేట: మండలంలో ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద తీవ్రతకు తిమ్మంపేట, మల్లూరు గ్రామాల మధ్యగల 10 తూముల మోరీ సమీపంలో గతంలో ఏర్పడిన గండిని పూడ్చకపోవడంతో సుమారు 15 మీటర్ల పైగా కోతకు గురై వరదనీరంతా పంట పొలాలను ముంచెత్తింది. సుమారు 10 ఎకరాలకు పైగా వరిపైరుపై ఇసుక మేట వేయడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. అలాగే 50ఎకరాలకు పైగా వరిపొలాలు నీట మునిగిపోయాయి. అదే విదంగా బోరునర్సాపురం సమీపంలోని ఉప్పలనర్సయ్య చెరువు మత్తడి కింద పొలాలన్నీ నీటి మునిగి చెరువులను తలపిస్తున్నాయి. బాలన్నగూడెం శివారులోని మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టు ఎడమ కాల్వ వరదతో తిమ్మంపేటకు చెందిన రైతులు సల్లూరు నర్సయ్య, సమ్మయ్య, కుమ్మరి వెంకన్నకు చెందిన సుమారు 10ఎకరాల్లోని వరినాటు కొట్టుకుపోయింది.