
రేపు సర్ధార్ పాపన్న జయంతి
ములుగు రూరల్: రేపు(సోమవారం) జిల్లా కేంద్రంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్ధార్ పాపన్న జయంతి వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి సర్ధార్‌సింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బీసీ సంఘాల సభ్యులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
ములుగు రూరల్: భారీ వర్షాలతో మత్తడి పోస్తున్న చెరువులు, కుంటల మత్తళ్లకు అడ్డుగా నీటికి జాలీలు, కర్రలు అడ్డుగా ఏర్పాటు చేయొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్‌మన్‌రాజు అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ దివాకర ఆదేశాల మేరకు మత్స్యశాఖ పారిశ్రామిక సంఘాలు, గిరిజన మత్స్య పారిశ్రామిక సంఘాల సభ్యులు నిబంధనలు పాటించాలని సూచించారు. మత్తడి నీటికి వలలు, జాలీలు అడ్డుకట్టడం వల్ల తెగిపోయే ప్రమాదం ఉంటుందని వివరించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్(ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం 2005) చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గోదావరి, రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు.
గోవిందరావుపేట: ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం సంస్థ సూపర్‌వైజర్ రజని అన్నారు. మండల పరిధిలోని బాలాజీ నగర్‌లో శనివారం తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఈసీ క్యాంపెనింగ్ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ వ్యాధులతో బాధపడకుండా అన్ని రకాల పరీక్షలు చేయడంతో పాటు హెచ్‌ఐవీ పరీక్ష కూడా చేయించాలన్నారు. హెచ్‌ఐవీ నాలుగు విధాలుగా సోకుతుందన్నారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషితమైన సూదులు, పరీక్షించని రక్త మార్పిడి, హెచ్‌ఐవీ తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకి సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. గర్భిణులు తప్పకుండా హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోవాలన్నారు. గర్భిణులు తప్పకుండా ఆస్పత్రిలోనే డెలివరీ అయ్యేలా చూసుకోవాలని సూచించారు.