
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జంపన్నవాగు వరద ఉధృతి కారణంగా పంటలు నీటమునిగి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. మండల పరిధిలోని మేడారంలో జంపన్నవాగు వరదతో మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి గ్రామాల్లో నీటమునిగిన వరి పంటలను ఆమె పార్టీ నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు. జంపన్నవాగును సందర్శించి వరద పరిస్దితులను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ భారీ వర్షాలు కురియడంతో జంపన్నవాగు వరదతో పంట పొలాలు నీటమునిగి దెబ్బతిన్నాయన్నారు. నాట్లు వేసిన అనతికాలంలో వరదలతో పంట పొలాలు నీటమునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. పంటలు నీటమునిగిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జంపన్న వాగుకు కరకట్ట ఎత్తు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వాగు వరదలతో ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని గెలిచిన మంత్రి సీతక్క ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి ప్రజలకు తెలపాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మల్లయ్య, జిల్లా నాయకులు ఎట్టి జగదీశ్, మాజీ సర్పంచ్ బాబురావు, మండల యూత్ అధ్యక్షుడు కోట సురేష్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్
నాగజ్యోతి