
రాబోయే నాలుగురోజులు భారీ వర్షాలు
రాబోయే నాలుగు రోజులు అతి భారీ వర్షాలు ఉండడంతో ఏజెన్సీలో గోదావరి, వాగులు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వాగులు దాటడం, చేపలు, పడవల్లో ప్రయాణం చేయడం మానుకోవాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షాలు ముగిసే వరకు ప్రయాణాలను మానుకోవాలని తెలిపారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆహారం, నీరు, మందులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎవరికై నా ఏదైనా అవసరమైతే వెంటనే 100 డయల్ చేయడం లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శిథిలమైన ఇళ్లలో ఉండవద్దని, వృద్ధులు, పిల్లలు, గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.