
బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి
ములుగు రూరల్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి పార్లమెంట్‌లో చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివరెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ రోడ్డులో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు మైనారిటీలు పొందకూడదని బీజేపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. మాటల్లో బీసీ మంత్రం జపిస్తూ బిల్లు ఆమోదానికి ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాలైన గుజరాత్, యూపీ ఇతర రాష్ట్రాలలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ, తెలంగాణలో బీసీ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా బీసీలు తమ హక్కులను సాధించుకునేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తుమ్మల వెంకట్‌రెడ్డి, చిట్టిబాబు, సోమ మల్లారెడ్డి, ఆదిరెడ్డి, గొంది రాజేశ్, గుండబోయిన రవిగౌడ్, రత్నం, రాజేందర్, ప్రవీణ్, ఐలయ్య, రమేశ్, రాజు, కోటయ్య, రామస్వామి, దేవేందర్, సువర్ణ, భూక్య రాజు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా