
విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి : నిరక్షరాస్యతను అంతం చేసి, విద్యను అందించడం ద్వారా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని మండల తోగులో నిర్మించిన నూతన పాఠశాలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్‌జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గొత్తికోయ గూడెల్లో చిన్నారులకు విద్య అందించాలని, అందుకు ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. అభయారణ్యంలోని పిల్లలకు విద్యను అందించాలనే సంకల్పంతో పీపుల్ హెల్పింగ్ సెంటర్ ఎన్‌జీఓ సంతోష్ 2020 నుంచి తమ సేవలను అందిస్తున్నాడన్నారు. విద్య ప్రాథమిక హక్కు అని, గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పిస్తూ, విద్యను అందించడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సీతక్క, కలెక్టర్, ఇతర అధికారులు భోజనం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, చక్రవర్తి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ధనసరి సీతక్క