
రామప్ప శిల్పకళ అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ అద్భుతంగా ఉందని జపాన్ దేశానికి చెందిన టోమా సకా కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆమె ఆదివారం సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా ఆలయ విశిష్టతను గైడ్ విజయ్‌కుమార్ వివరించారు. అదేవిధంగా ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సైతం అధికసంఖ్యలో రామప్పకు తరలివచ్చి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు.
హేమాచలుడికి భక్తిశ్రద్ధలతో పూజలు
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు పవన్‌కుమార్, ఈశ్వర్‌చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల పేరిట పూజారులు గోత్రనామాలతో అర్చనలు జరిపించారు.
ముత్యాలమ్మకు బోనాలు
వాజేడు: మండల పరిధిలోని పెద్దగొళ్లగూడెంకు చెందిన మహిళలు ముత్యాలమ్మకు ఆదివారం బోనాలు సమర్పించారు. గ్రామంలోని మహిళలంతా బోనాలతో గ్రామ సమీపంలో ఉన్న ముత్యాలమ్మ గుడికి ఊరేగింపుగా తరలివెళ్లారు. ముత్యాలమ్మ కొలువై ఉన్న చెట్టుచుట్టూ బోనాలతో ప్రదక్షిణలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తమ కోర్కెలు నెరవేర్చాలని అమ్మవారికి బోనాలు సమర్పించారు. రైతులను, ప్రజలను చల్లంగా చూడుతల్లీ అంటూ వేడుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు.

రామప్ప శిల్పకళ అద్భుతం

రామప్ప శిల్పకళ అద్భుతం