
ఎండుతున్న పొలాలు
నీరులేక ఎండుతున్న వరిపొలం
వెంకటాపురం(కె) : వానాకాలంలోనూ ఎండలు దంచికొడుతున్నాయి.. పాలెంవాగు ప్రాజెక్టు కింద సాగు చేసిన వరిపొలాలు నెర్రెలుబారి ఎండిపోతోంది. ఇంజిన్ల సాయంతో నీరు పారించేందుకు అన్నదాతలు నానాఅవస్థలు పడుతున్నారు. మండలంలో వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్న ఇప్పటి వరకు సరైన వర్షాలు లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జూలైలో ఒక్కసారి భారీ వర్షం కురవడంతో అన్నదాతలు ముమ్మరంగా వరినాట్లు వేసుకున్నారు. ముందస్తుగా నాట్లు వేసుకున్న రైతులు సైతం వరుణుడి రాకకోసం ఎదురు చూస్తున్నారు. 20రోజులుగా వాన చినుకు జాడ లేకపోవడంతో వరి పొలాలు నీరులేక నెర్రెలుబారుతున్నాయి. రూ.వేలల్లో పెట్టుబడి పెట్టి వరిసాగు చేసిన అన్నదాతలు వాటిని కాపాడుకునేందుకు వాగులు, వంకల్లో ఇంజిన్ల పెట్టి వాటిసాయంతో నీటిని పారిస్తున్నారు.
శిథిలావస్థలో కాల్వలు
మండల పరిధిలోని మల్లాపురం, రాచపల్లి గ్రామ సమీపంలో నిర్మించిన పాలెంవాగు ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వఉన్న చివరి ఆయకట్టుకు సాగునీరు అందని దుస్థితి నెలకొంది. 10,125 ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో నిర్మించిన పాలెం ప్రాజెక్టు ప్రస్తుతం 2,000 ఎకరాలకు సాగు నీరు అందించలేక పోతోంది. ప్రాజ్టెకు పరిధిలోని కాల్వలు మరమ్మతుకు గురై శిథిలావస్థకు చేరుకున్నాయి. మల్లాపురం, రాచపల్లి, కర్రవానిగుంపు, ఒంటిమామిడి గ్రామ సమీపంలో ప్రాజెక్టు కాల్వలకు గండ్లు పడడంతో రైతులు సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రాజెక్టు కాల్వలకు మరమ్మతులు చేసి పూర్తిస్థాయి చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
పొలాల్లో చుక్కనీరు లేదు
ఇరవై రోజులుగా వరి పొలానికి నీరు లేక ఎండిపోతుంది. వర్షం లేకపోవడంతో పొలాల్లో చుక్కనీరు లేదు. కిరాయికి ఇంజిన్ పెట్టి నీరు పెడదా మంటే, రోజుకు ఇంజిన్‌కు రూ.వెయ్యి, డీజిల్ కు మరో రూ.వెయ్యి ఖర్చవుతుంది. ప్రాజెక్టులో నీరు ఉన్న పంట పొలాలకు పూర్తిస్థాయిలో అందడం లేదు. – పోతురాజు, రైతు
అప్పు చేసి సాగుచేసిన..
వరి పంట సాగుకు అప్పులు చేసిన. ప్రాజెక్టు ఉన్న పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరు అందే పరిస్థితి లేదు. మండలంలో 20రోజులుగా వాన చినుకు లేకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పటినుంచి వరి పంటకు ఇంజిన్‌లతో నీరు పెట్టాలంటే కష్టంగా ఉంది.
– కృష్ణ, రైతు
కరుణించని వరుణుడు
నెర్రెలుబారుతున్న పంటపొలాలు
చినుకుజాడకు రైతుల ఎదురుచూపు
పాలెం ప్రాజెక్టు ఉన్నా
నిరుపయోగమే..

ఎండుతున్న పొలాలు

ఎండుతున్న పొలాలు