
నులి పురుగులకు చెక్..
వెంకటాపురం(ఎం): ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ఎక్కువ మంది పిల్లలు బాధపడే సమస్యల్లో నులిపురుగులు ఒకటి. నులి పురుగులకు చెక్ పెట్టి పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నప్పుడే చదువుతో పాటు జీవితంలో రాణిస్తారు. తల్లిదండ్రుల ప్రత్యేక పర్యవేక్షణతో పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించి, శారీరక, మానసికాభివృద్ధికి తోడ్పాటు అందించాలి. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నేడు (సోమవారం) మందుల పంపిణీకి వైద్యారోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. స్థానిక ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్ల ద్వారా 19 ఏళ్లలోపు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు.
అసలెందుకు వస్తాయి!
అపరిశుభ్ర వాతావరణం, మురికి కాల్వలు, నీటి నిల్వ, జంతువుల మలం.. తదితర వాటితో నులి పురుగులు వ్యాప్తి చెందుతాయి. ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల ఈ సమస్య త్వరగా వ్యాప్తి చెందుతుంది. నిల్వ ఉన్న ఆహారంతో పాటు ఉడకని మాంసం, పులిసిన పదార్థాలు తీసుకోవడం వంటివి కూడా కారణమే. తీపి, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా, మలబద్దకం ఉన్నా నులిపురుగులు తయారవుతాయి. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోకపోవడం, చెప్పులు లేకుండా తిరగడం, పిల్లలు మట్టిలో ఆడుతూ ఆ చేతులను నోట్లో పెట్టుకోవడం కూడా ఈ సమస్యకు కారణమని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. నులిపురుగుల్లో బద్దె, నట్టలు, కొంకి, కొరడా, ఏలిక పాములు, దారపు, నీరుగడ్డ వంటి రకరకాల నులి పురుగుల రకాలు ఉన్నాయి. ఇవి ఎక్కువ శాతం చిన్నారుల పొట్టల్లో స్థావరం ఏర్పాటు చేసుకుంటాయి. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.
లక్షణాలు ఇవే..
మలం వెళ్లే మార్గంలో దురద, అజీర్ణం, వాంతులు, విరేచనాలు, పొడి దగ్గు, నీరసం, కాలేయం పెరగడం, ఆడపిల్లల్లో తెల్లబట్ట కావడం, ఎక్కువ సార్లు మూత్ర విసర్జన, బరువు తగ్గడం, పోషకాహారలోపం, కడుపు నొప్పి, చదువులో ఏకాగ్రత లేకపోవడం, ఎదుగుదల తగ్గడం, మలంలో రక్తం పడడం, జ్వరం, తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.
జిల్లాలో 73,110 మంది పిల్లలు
జిల్లా వ్యాప్తంగా 19 ఏళ్లలోపు పిల్లలు 73,110 ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది. అంగన్‌వాడీ పరిధిలో 17,289 మంది, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 40,241 మంది పిల్లలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 15,580 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నేడు(సోమవారం) 482 మంది ఆశ కార్యకర్తలు, 606 మంది అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు ఏఎన్‌ఎంలు సంబంధిత పాఠశాలలకు వెళ్లి పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. 11వ తేదీన గోలీలు వేసుకోలేని పిల్లలకు 18వ తేదీన మాప్ డేను పురస్కరించుకుని వేయనున్నారు.
మాత్రలు వాడే విధానం
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాతనే పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలి.అనారోగ్యంతో ఉన్న వారు పూర్తిగా కోలుకున్న తర్వాతనే మాత్రలు వేసుకోవాలి. ఏడాది వయస్సు ఉన్న వారికి, గర్భిణులు, బాలింతలు, కాలేయ వ్యాధిగ్రస్తులు, ఉదర సంబంధిత కేన్సర్ ఉన్న వారికి, పుట్టుకతో గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి ఈ మాత్రలను ఇవ్వకూడదు. 1 నుంచి 2 ఏళ్ల లోపు చిన్నారులకు సగం గోలి, 2 నుంచి 3 ఏళ్ల పిల్లలకు ఒక టాబ్లెట్‌ను పొడి చేసి నీటిలో కలిపి తాగించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. 3 నుంచి 19 ఏళ్ల బాలురు మాత్రం గోలీని నమిలి మింగాలని చెబుతున్నారు.
పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
నేడు నులిపురుగుల
నివారణ దినోత్సవం