
సౌర విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు
ములుగు రూరల్: సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్, రెడ్ కో సీఎండీ, ఎన్‌పీడీసీఎల్ సీఎండి, సింగరేణి కాలరీస్ సీఎండీలతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భూములు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో సౌర విద్యుత్ ఉత్పాదకతకు నివేదికలు తయారు చేయాలని సూచించారు. జిల్లాల వారీగా వివరాలకు ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌కు పంపించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో రూ.6.17లక్షల ఎకరాల్లో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు, కార్యాలయాలు, భవనాల వివరాలను అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
వీసీలో ఉపముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క