
అర్ధనారీశ్వరుడిగా రామలింగేశ్వరస్వామి
వెంకటాపురం(ఎం): శ్రావణమాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామప్ప ఆలయంలోని రామలింగేశ్వరస్వామిని అర్ధనారీశ్వరుడిగా అలంకరించినట్లు ఆలయ ప్రధాన పూజారి కోమల్లపల్లి హరీశ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు, పర్యాటకులు రామప్ప ఆలయానికి తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేసినట్లు హరీశ్ శర్మ పేర్కొన్నారు.
రేపు విద్యుత్ ఉపకేంద్రం
పనులకు శంకుస్థాపన
కన్నాయిగూడెం: మండలంలో ఏర్పాటు చేయనున్న 33 కేవీ, 11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం శంకుస్థాపన పనులకు రేపు(ఆదివారం) రాష్ట్ర మంత్రులు రానున్నట్లు ఎన్పీడీసీఎల్ విద్యుత్ చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మండలంలో పర్యటించి తుపాకులగూడెంలో విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటు కోసం విద్యుత్ అధికారులతో కలిసి రాజు చౌహన్ స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆదివారం మంత్రుల పర్యటన ఉన్నందున కావాల్సిన ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ మల్సుర్ నాయక్, ములుగు, ఏటూరునాగారం డీఈ నాగేశ్వర్‌రావు, కన్నాయిగూడెం ఏఈ స్వామి పాల్గొన్నారు.
నిట్‌తో నోయిడా మిస్టోటెక్స్ టెక్నాలజీ ఎంఓయూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో నోయిడాకు చెందిన మిస్టోటెక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. జాతీయ రహదారుల భద్రత, చలనం, వినియోగదారుల సంతృప్తిని మెరుగుపర్చే ఏఐ ఆధారిత పరిశోధన కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిట్ రిజిస్ట్రార్ సునీల్‌కుమార్ మెహతా, ప్రొఫెసర్లు వెంకట్‌రెడ్డి, శంకర్, కె.వి.ఆర్ రవిశంకర్, అర్పణ్ మెహర్, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, మిస్టోటెక్స్ సంస్థ తరఫున చేతన్‌కుమార్, మాజీ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు పాల్గొన్నారు.
ఓసీ–2ను అడ్డుకుంటాం..
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్–2లో వ్యవసాయ భూములు కోల్పోయిన ఫక్కీర్‌గడ్డ, ఆకుదారివాడలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కల్పించాలని భూనిర్వాసితులు బుర్ర మనోజ్, రమేష్, రాజయ్య, రవి కోరారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎనిమిదేళ్ల నుంచి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. భూ నిర్వాసితులపై చిన్న చూపు చూస్తున్న సింగరేణి యాజమాన్యం నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కల్పిస్తామని మాయమాటలతో మభ్యపెడుతుందన్నారు. సింగరేణి సీఎండీ స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
క్షుద్రపూజల కలకలం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ఆర్చిగేట్ దగ్గర ఆదిముక్తీశ్వర స్వామి ఆ లయానికి వెళ్లే రోడ్డుపై క్షుద్ర పూజలు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున నల్లకోడి, గుమ్మడికాయ, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, మద్యం ఆనవాళ్లు కనిపించాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

అర్ధనారీశ్వరుడిగా రామలింగేశ్వరస్వామి

అర్ధనారీశ్వరుడిగా రామలింగేశ్వరస్వామి