
మరోసారి పూజారుల సమావేశం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరలో అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ అధికారులు, పూజారులు శుక్రవారం మేడారంలో మరోసారి సమావేశమయ్యారు. ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు పూజారులు సమావేశమయ్యారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై చర్చించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుస క్రమంలో ఏర్పాటు చేసే విషయంపై పూజారుల అభిప్రాయాలను దేవాదాయశాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై పూజారులు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకరలకు వివరించిన తర్వాత తుది అభిప్రాయాలను ప్రకటిస్తామని పూజారులు సమావేశంలో తెలిపినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఈ నెల మేడారంలో 21న పొట్ట పండుగ నిర్వహించనున్నట్లు పూజారుల తెలిపారు. సంస్కృతి, సంప్రదాయంగా రెండు రోజుల పాటు పొట్ట పండుగ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో పూజారులు సిద్ధబోయిన ముణిందర్, కొక్కర కృష్ణయ్య, చందా బాబురావు, చందా రఘుపతి, సారలమ్మ పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక సారయ్య, కాక కిరణ్, గోవిందరాజు పూజారి దబ్బగట్ల గోవర్ధన్, పూజారులు పాల్గొన్నారు.