
11న నులిపురుగుల నివారణ దినోత్సవం
ములుగు రూరల్: ఈ నెల 11న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో శుక్రవారం ఆయన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నులిపురుగుల నివారణపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. 11న అంగన్‌వాడీలు, ఆశ్రమ, గురుకుల, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు. దీంతో విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించడంతో పాటు శారీరక, మానసిక పెరుగుదల ఉంటుందని వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు టీంలుగా ఏర్పడి విద్యార్థులకు మాత్రలు అందించాలని సూచించారు. పిలల్లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో శిశు ఆరోగ్య, వ్యాధి నిరోధక టీకాలు ప్రోగ్రాం ఆఫీసర్ రణదీర్, జిల్లా తల్లి ఆరోగ్యము, పోషకాహార ప్రోగ్రాం అధికారి శ్రీకాంత్, డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు