
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
ములుగు రూరల్: విధి నిర్వహణలో వైద్యాధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ములుగు, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట ఆస్పత్రుల వైద్యాధికారులతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ ల్యాబ్‌లు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్టు ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు రక్త పరీక్షలకు అవసరమయ్యే పరీక్ష సామగ్రి వర్షాకాలమంతా సరిపడేలా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జ్వరంతో బాధపడుతున్న ప్రతీ వ్యక్తికి డెంగీ, మలేరియా పరీక్షలు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ శాఖ అధికారుల సమన్వయంతో పరిసరాల పరిశుభ్రత చేయించాలని వెల్లడించారు. దోమల నివారణకు యాంటీ లార్వా స్పెయింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కీటక జనిత జిల్లా పోగ్రాం ఆఫీసర్ శ్రీకాంత్, మధు, నిఖిల్, నాగన్వేష్, దుర్గారావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ బొడ్డు ప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు