నెట్‌ఫ్లిక్స్‌: జిందగీ ఇన్‌ షార్ట్ మూవీ రివ్యూ

Zindagi inShort Movie Review In Telugu - Sakshi

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ సెట్‌ చేసిన ట్రెండ్, క్రియేట్‌ చేసిన డిమాండ్‌.. ఆంథాలజీ. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్‌.. ఎట్‌సెట్రా స్ట్రీమింగ్‌ చానెల్స్‌లో సిరీస్‌ కాకుండా సినిమాల కేటగిరీలో ఎక్కువ భాగం ఈ ఆంథాలజీలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ‘జిందగీ ఇన్‌ షార్ట్’ కూడా ఆ కోవలోనిదే. అయితే సాధారణంగా ఈ ఓటీటీల ఆంథాలజీలన్నిటికీ దాదాపుగా సెక్స్‌ అండ్‌ క్రైమే కథావస్తువులు. ఈ రకంగా చూస్తే జిందగీ ఇన్‌ షార్ట్స్‌ కొంచెం భిన్నమైనది. స్త్రీ ప్రాధాన్యమున్న కథాంశాలే ఎక్కువ. ఏడు కథల సమాహారం ఇది. ఈ ఏడింటినీ కలిపే అంతస్సూత్రమేదీ లేదు. వేటికవే వైవిధ్యమైనవి. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. 

పిన్ని.. 
జిందగీ ఇన్‌ షార్ట్స్‌లోని మొదటి కథ. టైటిల్‌ పేరు వినగానే తెలుగు పేరులా అనిపిస్తుంది. కాని ఇది ఉత్తర భారతదేశంలోని ఒక మిఠాయి. తనను టేకెన్‌ ఫర్‌ గ్రాంటెండ్‌గా తీసుకున్న కుటుంబానికి తన విలువను తెలియజెప్పే ఒక గృహిణి కథే ఇది. పెళ్లయిపోయి కూతురు, ఉద్యోగంతో భర్త బిజీగా ఉంటే తనకు చేతనైన వంటలతో కాలక్షేపం చేస్తూంటుంది ఆమె. పిన్ని చేయడంలో ఆమెకు ఆమే సాటి. ఆ రుచికి ఎవరైనా దాసోహమనాల్సిందే. ఆ వంటలను ఎక్కడో మెట్రో నగరంలో ఉన్న తన బిడ్డకు కొరియర్‌ చేస్తూ ఫోన్‌లో రెండు మాటల కోసం ఎదురుచూస్తూంటుంది. ఇక్కడ భర్త దగ్గర అలాంటి పలకరింపునే కోరుకుంటూంటుంది. కాని ఆ ఇద్దరూ ఆమెను నిర్లక్ష్యం చేస్తారు. ఇంకా చెప్పాలంటే అసలు ఆమె ఉనికికే పట్టించుకోరు. అవమానంగా ఫీలవుతుంది గృహిణి. ఆ ఇంట్లో..  భర్త, కూతురి జీవితాల్లో తన ఉనికిని తెలియజెప్పడం కోసం స్ట్రయిక్‌ మొదలుపెడుతుంది ఆమె. ఈ కథకు దర్శకురాలు బాలీవుడ్‌ ప్రముఖ హీరో ఆయుష్మాన్‌ ఖురానా భార్య తహిరా కశ్యప్‌ ఖురానా. ఇందులో గృహిణిగా నీనా గుప్త నటించారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు ఈ ఇద్దరూ. 

సన్నీ సైడ్‌ ఊపర్‌
పగలనక, రాత్రనక ఆసుపత్రిలో యంత్రంలా పనిచేస్తున్న డాక్టర్‌కు హఠాత్తుగా జీవితం ఎంత చిన్నదో అర్థమవుతుంది. తన తమ్ముడికి క్యాన్సర్‌ అని నిర్థారణ అవడంతో ఆ సత్యం బోధపడుతుంది. తన వాళ్లతో సమయం వెచ్చించాలని.. జీవితాన్ని ఆస్వాదించాలని అర్థమై కుటుంబాన్ని కలుసుకోవడానికి ప్రయాణమవుతుంది. దీనికి డైరెక్టర్‌ విజేతా కుమార్‌. డాక్టర్‌గా రీమా కళింగల్‌ నటించింది.

స్లీపింగ్‌ పార్ట్‌నర్‌..
భార్యను సాటి మనిషిగా కాకుండా కోరికలు తీర్చే యంత్రంలా భావించే భర్తకు గుణపాఠం నేర్పిన స్త్రీ ఇతివృత్తమే ‘స్లీపింగ్‌ పార్ట్‌నర్‌’. ఒకరకంగా మ్యారిటల్‌ రేప్‌ను ప్రశ్నిస్తున్న కథ ఇది. మ్యారిటల్‌ రేప్‌ బాధితురాలిగా దివ్య దత్తా, పురుషాహంకార భర్తగా సంజయ్‌ కపూర్‌ నటించారు. దర్శకత్వం.. పునర్వసు నాయక్‌. 

థప్పడ్‌
హైస్కూల్లో ఆడపిల్లలకు ఎదురయ్యే వేధింపుల కథ ఇది. సాధారణంగా ఇంట్లోంచి ఆడపిల్ల బయటకు వెళితే అన్ననో, తమ్ముడినో రక్షణగా పంపిస్తారు. అలాగే ఇందులో కూడా అక్కా, తమ్ముడు ఇద్దరూ కలిసే స్కూల్‌కి వెళ్తూంటారు. అక్కను ఆమె క్లాస్‌ అబ్బాయి ప్రేమిస్తున్నానంటూ, ఆ ప్రేమను ఒప్పుకోవాలని ఇబ్బంది పెడ్తుంటారు. తన సోదరి వాళ్లకు భయపడకుండా తను చదివే కామిక్‌ పుస్తకాల్లోని హీరోలా ఫైట్‌ చేసి, వాళ్లకు బుద్ధి చెప్పాలని ఆరాటపడ్డమే కాకుండా తన అక్కలోని ధైర్యాన్ని ఆమెకు పరిచయం చేస్తాడు. తమ్ముడు అనుకున్నట్టుగానే అక్క ఆ జులాయిలకు బుద్ధి చెప్తుంది. తమ్ముడిగా షాఫిన్‌ పటేల్, అక్కగా వేదిక నవానీ నటన అద్భుతం. దర్శకత్వం.. వినయ్‌ చావల్‌. 

ఇవికాక
అభద్రతా భావంతో తనను అనుమానించే భర్తకు ఆ భార్య నేర్పిన గుణపాఠంగా ‘స్వాహా’ అనే కథా బాగుంది. సంయుక్త పాణిగ్రాహి దర్శకత్వం వహించిన ఈ కథలో  భర్తగా దీపక్‌ దోబ్రియాల్, భార్యగా ఇషా తల్వార్‌ నటించారు. డేటింగ్‌ యాప్‌ల స్నేహాలు, మతాల అంతరాలు, స్త్రీ సాధికారత అంశాలుగా సాగిన కథ గౌతమ్‌ గోవింద శర్మ దర్శకత్వంలోని ‘ఛాజు కే దహీ బల్లే’, రాకేశ్‌ సైన్‌ దర్శకత్వం వహించిన ‘ఒంటరి స్త్రీ దిగులు జీవితపు కథ ‘నానో సే ఫోబియా’ వంటివీ అలరిస్తాయి. 

ముందుగా చెప్పుకున్నట్టు వీటన్నిటికీ పోలిక చెప్పే అంతస్సూత్రం లేదు. కాని అన్ని కథలూ రివర్స్‌ మెకానిజంతో సాగినవే. స్త్రీ, పురుష సమానత్వ అవసరాన్ని చెప్పినవే.

చదవండి: Singer Sunitha: విమర్శకుల నోరు మూయించేసారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top