2022 Year Roundup: Bollywood and Other actresses who made Tollywood debut - Sakshi
Sakshi News home page

Year Roundup 2022 : ఈ ఏడాది టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అందమైన భామలు వీళ్లే..

Published Tue, Dec 13 2022 9:04 AM | Last Updated on Tue, Dec 13 2022 10:54 AM

Year Roundup 2022 :  Bollywood And Other Actresses Who Have Debuted In Tollywood - Sakshi

2022లో తెలుగు సిల్వర్‌ స్క్రీన్‌ మురిసిపోయింది. ఎందుకంటే ఇక్కడి తెరపై కొత్తగా మెరిసిన నాయికలను చూసి.. వేరే భాషలో ‘స్టార్‌’ అనిపించుకున్న నాయికలు, కొత్తవారు ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం అయ్యారు. దేశీ భామలనే కాదు.. విదేశీ భామలను కూడా తెలుగు స్క్రీన్‌ చూపించింది. ‘హాయ్‌ హాయ్‌.. నాయికా’ అంటూ ఈ తారలను ఆహ్వానించింది

మామూలుగా ఉత్తరాది భామలు ఎక్కువగా తెలుగుకి వస్తుంటారు. ఈసారి కూడా వచ్చారు. అయితే హిందీలో స్టార్‌ అనిపించుకుని, తెలుగు తెరకు కొత్తగా పరిచయం అయ్యారు. దాదాపు పదేళ్లు హిందీలో హీరోయిన్‌గా సినిమాలు చేసిన ఆలియా భట్‌ ఈ ఏడాది తెలుగుకి పరిచయం కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో ఆలియా నటించిన విషయం తెలిసిందే. ఇదే సినిమాలో ఎన్టీఆర్‌ ప్రేయసిగా చేసిన పాత్ర ద్వారా విదేశీ బ్యూటీ ఒలీవియా మోరిస్‌ తెలుగు తెరపై మెరిశారు.

అలాగే ముంబై బ్యూటీస్‌ మృణాల్‌ ఠాకూర్, అనన్యా పాండే, సయీ మంజ్రేకర్‌ల టాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఈ ఏడాదే జరిగింది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సీతారామం’ హీరోయిన్‌గా తెలుగులో మృణాల్‌కు తొలి చిత్రం. మరో హిందీ భామ అనన్యా పాండే (నటుడు చుంకీ పాండే కుమార్తె) నటించిన తొలి తెలుగు చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఈ చిత్రం రూపొందింది. అలాగే బాలీవుడ్‌ దర్శక–నిర్మాత, నటుడు మహేశ్‌ మంజ్రేకర్‌ కుమార్తె సయీ మంజ్రేకర్‌ ‘గని’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం తర్వాత సయీ ‘మేజర్‌’ (తెలుగు – హిందీ)లో ఓ హీరోయిన్‌గా నటించారు. ఇందులో అడివి శేష్‌ టైటిల్‌ రోల్‌ చేయగా శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు.

శ్రీ విష్ణు హీరోగా చేసిన ‘అల్లూరి’తో నార్త్‌ ఈస్ట్‌ అమ్మాయి కయాదు లోహర్, విశ్వక్‌సేన్‌ ‘ఓరి. ..దేవుడా’తో మిథిలా పాల్కర్, ఆకాష్‌ పూరి ‘చోర్‌ బజార్‌’తో గెహ్నా సిప్పి.. ఇలా చాలామంది తెలుగుకి వచ్చారు. కాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో పరిచయమైన విదేశీ భామ ఒలీవియాలానే ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించిన మరో విదేశీ భామ షిర్లే సేథియా. నాగశౌర్య హీరోగా నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ ద్వారా ఈ న్యూజిల్యాండ్‌ బ్యూటీ తెలుగుకి వచ్చారు. మరోవైపు మలయాళ కుట్టీల తెలుగు అరంగేట్రం కూడా ఈ ఏడాది బాగానే జరిగింది. మలయాళంలో అగ్ర తారల్లో ఒకరైన నజ్రియా ఎంట్రీ ఈ ఏడాది జూన్‌ 10న విడుదలైన ‘అంటే.. సుందరానికీ!’ చిత్రంతో కుదిరింది. నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్‌ ఆత్రేయ దర్శకుడు.

సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్, రానా హీరోలుగా రూపొందిన ‘భీమ్లా నాయక్‌’లో ఓ హీరోయిన్‌గా నటించారు సంయుక్తా. ఈ చిత్రంలో రానా భార్య పాత్రలో కనిపిస్తారామె. కల్యాణ్‌ రామ్‌ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన ‘బింబిసార’లోనూ సంయుక్త నటించారు. మరోవైపు రవితేజ హీరోగా శరత్‌ మండవ డైరెక్షన్‌లో వచ్చిన ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు రజీషా విజయన్‌. కాగా ‘బ్లఫ్‌మాస్టర్‌’ తర్వాత హీరో సత్యదేవ్, దర్శకుడు గోపీ గణేష్‌ కాంబినేషన్‌లో వచి్చన ‘గాడ్సే’తో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అలాగే మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటించిన ‘సర్కారువారి పాట’లో సౌమ్య మీనన్‌ నటించారు. కీర్తి ఫ్రెండ్‌ పాత్రలో కనిపిస్తారు సౌమ్య. ఇంకోవైపు సత్యదేవ్‌ హీరోగా నాగశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుర్తుందా.. శీతాకాలం’లో కన్నడ భామ కావ్యా శెట్టి హీరోయిన్‌గా చేశారు. విశ్వక్‌సేన్‌ ‘ఓరి.. దేవుడా’లో ఓ హీరోయిన్‌గా చేసిన ఆశా భట్‌ కన్నడ బ్యూటీనే. ఈ కథానాయికలకే కాదు... టాలీవుడ్‌ మరెందరో తారలకు స్వాగతం పలికింది. మొత్తానికి 2022 తెలుగు సిల్వర్‌ స్క్రీన్‌ కొత్త మెరుపులను చూపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement