
అక్కినేని నాగచైతన్యతో పాటు సమంతకు చాలా ప్రత్యేకమైన చిత్రం 'ఏమాయ చేసావె'(Ye Maaya Chesave). 2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం 15 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కానుంది. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సామ్ నటిగా తెరంగ్రేటం చేశారు. ఫిలింఫేర్ అవార్డ్‌తో పాటు స్పెషల్ జ్యూరీ విభాగంలో ఆమె నంది అవార్డ్ అందుకుంది. 'ఏమాయ చేసావె'తో నాగచైతన్య(Naga Chaitanya), సమంతలకు (Samantha) ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాతోనే వారు మొదటిసారి కలిసి పనిచేశారు. తర్వాత పెళ్లి వంటి తదితర అంశాల సంగతి తెలిసిందే. వారిద్దరి జీవితంలో చాలా ముఖ్యమైన చిత్రం ఇప్పుడు రీరిలీజ్ కానున్నడంతో ఫ్యాన్స్‌లో జోష్ మొదలైంది.

జూలై 18న 'ఏమాయ చేసావె' రీరిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జెస్సీ పాత్రలో కనిపించిన సమంత.. మొదటి చిత్రంతోనే భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన సంగీతం నేటికీ విశేషంగా ఆదరించబడుతోంది. కార్తీక్ (నాగచైతన్య) అనే యువ అసిస్టెంట్ డైరెక్టర్‌కి, తనకంటే రెండేళ్ళు పెద్దదైన జెస్సీ అనే మలయాళ క్రిష్టియన్ అమ్మాయి మధ్య నడిచిన ప్రేమాయణం ఇందులో చక్కగా దర్శకుడు చూపించారు.
ఈ ప్రయాణంలో వారు వారి కుటుంబాల నుంచి ఎదురుకున్న ఒడిదుడుకుల నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏకకాలంలో తమిళంలో కూడా విడుదలైంది. అక్కడ 'విన్నైతాండి వరువాయా' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో శింబు, త్రిష ముఖ్య పాత్రల్లో నటించారు. కానీ ఈ సినిమా హిందీలో 'ఏక్ థా దీవానా' పేరుతో రీమేక్ అయింది. అక్కడ మాత్రం పరాజయం చవి చూసింది.