ప్రేక్షకులను.. చేతబడితో కట్టిపారేస్తున్నారు..! | Why Black Magic Movies Are Becoming Superhits in India? | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులను.. చేతబడితో కట్టిపారేస్తున్నారు..!

Jan 20 2026 10:30 AM | Updated on Jan 20 2026 10:59 AM

Why Black Magic Movies Are Becoming Superhits in India?

చేతబడి.. బాణామతి.. చిల్లంగి..! పేరు ఏదైనా.. అదో మూఢనమ్మకం, అంధ విశ్వాసం..! అయితే.. ముందెన్నడూ లేనివిధంగా ఇటీవలి కాలంలో చేతబడిపై ప్రజల్లో విశ్వాసం బాగా పెరుగుతోందని తెలుస్తోంది. ఇందుకు కారణం.. చేతబడి సంబంధిత సినిమాలు హిట్ కొట్టడం.. బాణామతికి సంబంధించిన రీల్స్‌కు వ్యూవ్స్ మిలియన్లలో ఉండడమే..! ఇక సందేట్లో సడేమియా మాదిరిగా ప్రజల మూఢవిశ్వాసాన్ని క్యాష్ చేసుకునేందుకు దొంగబాబాలెందరో పుట్టుకొస్తున్నారు. అయితే.. దర్శకనిర్మాతలు కూడా ప్రేక్షకుల్లో చేతబడిపై ఉన్న ఇంట్రెస్ట్‌ను అందిపుచ్చకుంటూ.. హిట్లు ఇస్తున్నారు. అలాంటి సినిమాల విశేషాలు తెలుసుకోవాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి..!

ప్రతి మనిషిలో ఏదో ఓ మూలన భయం ఉంటుంది. హారర్ సినిమా అభిమానులు మాత్రం భయపడడం కూడా ఓ ఆర్ట్ అంటారు. కథలో మూఢనమ్మకాలు, చేతబడి, బాణామతి వంటి అంశాలు ఉంటే వాటిని మరింత ఆసక్తిగా చూస్తారు. సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా.. చేతబడి పేరుతో మనచుట్టూ అనేక ఘోరాలు జరుగుతున్నాయి. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రోజుల్లో ఈ పిచ్చి పీక్‌కు వెళ్తోంది. ఈ కాన్సెప్ట్‌లతోనే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేసుకునేందుకు దర్శక, నిర్మాతలు తహతహలాడుతున్నారు. సినిమా స్టోరీల కోసం ఎంతో రీసెర్చ్ చేస్తున్నారు. చేతబడి మూలాల వరకు వెళ్లి మరీ సినిమాలు తీస్తున్నారు. 

అల్లాటప్పాగా ఏదో ప్రేక్షకులకు చూపించాం అని కాకుండా.. చేతబడి కాన్సెప్ట్‌ను పూర్తిగా అర్థమయ్యేలా వాస్తవ ఘటనలను తమ సినిమాల్లో ఉటంకిస్తున్నారు. గత ఏడాది బాణామతి బ్రాక్‌డ్రాప్‌‌లో చేతబడి అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. 1953 గిరిడ అనే గ్రామంలో యదార్థ సంఘటన ఆధారంగా ఈ కథని సిద్ధం చేశారు. సీలేరు అనే గ్రామంలో 200 సంవత్సరాల క్రితం  వెదురు బొంగులు చాలా దట్టంగా ఉంటాయి. వర్షం పడినా అవి  నెలలోకి దిగవు. అలాంటి మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి అమావాస్య రోజు బాణామతి చేస్తే ఎలా ఉంటుంది..? ఆ గ్రామ ప్రజలకు కలిగిన నష్టం ఏంటి అనేది ఈ చిత్రంలో చూపించారు.

తెలుగులో చేతబడి సినిమాలు ఇప్పుడు బాగా పెరిగిపోయినా.. తెలుగు సినీ పరిశ్రమకు ఈ తరహా కథలు కొత్తేం కాదు. అప్పట్లో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవలల ఆధారంగా సినిమాలొచ్చాయి. వాటిల్లో కాష్మోరా, తులసిదళం పాపులర్ అయిన విషయం తెలిసిందే..! ఇటీవలి కాలంలో ‘మసూద’ సినిమాతో చేతబడి పిచ్చి పీక్‌కు చేరుకుంటోంది. అరుంధతి వంటి సినిమాల్లోనూ ప్రతినాయకుడు పశుపతి, అదే.. సోనూసుద్ క్షుద్ర విద్యలను నేర్చుకోవడం.. అన్వేషణ, రక్ష, ఓదెల-2, పొలిమేర సీక్వెల్, పిశాచి, అమ్మోరు, దహినీ, విరూపాక్ష, లియో, మ్యాన్షన్ 24,మంగళవారం, పిండం వంటి మూవీస్‌ హిట్లు కొట్టాయి. వీటిల్లో చాలా సినిమాలు 100 కోట్ల రూపాయలకు పైగానే మార్కెట్‌ చేశాయి.

2008లో విడుదలైన రక్ష.. తెలుగు ఇండస్ట్రీలోనే  ఇప్పటివరకు వచ్చిన చేతబడి చిత్రాలలో అత్యంత భయానకంగా ఉంటుంది. బాలీవుడ్‌ 'ఫూంక్‌' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు కూడా 1980 నాటి యండమూరి నవల తులసీదళమే ఆధారం కావడం గమనార్హం..! దెయ్యాల ప్రమేయం లేకున్నా.. కొన్ని చేతబడి సినిమాలు ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించేలా దర్శకులు తెరకెక్కిస్తున్నారు. ఇక షార్ట్‌ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో కూడా ఈ మధ్య కాలంలో చేతబడి, అతీత శక్తులు, ఆత్మలకు సంబంధించిన పారానార్మల్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 

అమెజాన్-ఎంఎక్స్ ప్లేయర్‌లో అందుబాటులో ఉన్న ‘భయ్’ అనే వెబ్ సిరీస్ పలు భాషల్లో సూపర్‌డూపర్ హిట్ అవ్వడం ఇందుకు నిదర్శనం..! ఏది ఏమైనా.. ప్రేక్షకులు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. చేతబడులు అనేవి కేవలం మూఢనమ్మకాలు మాత్రమే..! సినిమాల్లో దర్శకులు చూపించే అంశాలను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూడాలే తప్ప.. వాటిని గుడ్డిగా నమ్మి, అవే నిజమనే భ్రమలో ఉండకూడదు. 

-బ్రహ్మయ్య కోడూరు, సాక్షి వెబ్‌ డెస్క్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement