
ప్రమాదం జరిగితే కష్టం, నష్టమే. కానీ, అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మంచి కూడా చేస్తాయి. ప్రముఖ హీరో అల్లు అర్జున్(Allu Arjun) స్వయంగా ఈ మాట అంటున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)(WAVES 2025)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ– ‘‘కెరీర్ తొలి రోజుల్లో నా దృష్టి అంతా ఫిజికల్ ఫిట్‌నెస్, ఎజిలిటీ మీదే ఉండేది. కానీ, జీవితంలో ఒక ఘటన నా ఆలోచననే మార్చేసింది. నా పదో సినిమా తర్వాత నా భుజానికి దెబ్బ తగిలి, ఆస్ట్రేలియాలో సర్జరీ చేయించుకున్నా. అంతా బాగైపోయి, నాలుగో వారం నుంచి సెట్స్ మీదకు వెళ్ళిపోవచ్చనుకున్నా. డాక్టర్లు 6 నెలలు రెస్ట్ తప్పనిసరి అన్నారు. నాకు కొత్తగా పెళ్ళయింది. ఓ సినిమా సగంలో ఉంది. అప్పటి దాకా ఫిజికల్ ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది.
వయసు పెరిగే కొద్దీ ఫిట్‌నెస్, ఎజిలిటీ తగ్గుతాయి. కానీ, నటనపై దృష్టి పెడితే అది చిరకాలం మిగిలిపోతుందని గ్రహించా. అక్కడి నుంచి నా ఆలోచనే మారిపోయింది’’ అని వివరించారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘పదో సినిమా దగ్గర మొదలైన ఆ ఆలోచన ఇరవయ్యో సినిమా ‘పుష్ప–1’ దగ్గరకు వచ్చేసరి కల్లా నన్ను జాతీయ ఉత్తమ నటుడిగా, అందులోనూ తెలుగు సినీరంగం నుంచి ఆ ఘనత అందుకున్న తొట్ట తొలి నటుడిగా నిలిపింది. పదో సినిమా సమయంలో ఆ యాక్సిడెంట్ జరగకపోతే... నా దృక్పథం ఇలా మారేది కాదు.
అందుకే, కొన్ని యాక్సిడెంట్లు అనుకోకుండా మన మంచికే జరుగుతాయి. మొత్తం నా ఆలోచనలు, కెరీర్‌నే మార్చేసిన ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్’’ అని అల్లు అర్జున్ వివరించారు. ‘సాక్షి’ ఆయనను పలకరించినప్పుడు ‘‘మెడిసిన్, టెక్నాలజీ లాంటి అనేక రంగాలలో చాలా కాలంగా జరుగుతున్న సమ్మిట్‌లు చూసి, అలాంటివి మన సినీ, వినోద రంగంలో కూడా జరగాలనుకున్నాను. ప్రధాని మోదీ చొరవతో తొలిసారిగా వేవ్స్ సదస్సు జరగడం శుభారంభం’’ అన్నారు.