
హిట్టు కోసం ఆరాటపడుతున్నాడు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). వరుస వైఫల్యాలతో సతమతవుతున్న అతడు కింగ్‌డమ్ మూవీపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 31న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సినిమా వల్లే..
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమా వల్ల సమాజంలో నాకంటూ పేరుప్రఖ్యాతలు వచ్చాయి. జనాల ప్రేమ దొరికింది. సినిమాల్లోకి రాకపోయుంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలుసు. అలాంటి జీవితం నాకొద్దు. కానీ సినిమాల్లో మునిగిపోయి పర్సనల్ లైఫ్‌ను మిస్ అవుతున్నాను. మన లైఫ్‌లో బంధాలు అన్నింటికన్నా ముఖ్యమైనవి. గత రెండేళ్లలోనే నాకు వీటి విలువ బాగా తెలిసొచ్చింది.
గర్ల్‌ఫ్రెండ్‌కు నో టైమ్
ఈ రెండుమూడేళ్లలో నేను జీవించిన విధానం నాకే నచ్చలేదు. అమ్మానాన్నకు సమయం కేటాయించలేదు. గర్ల్ ఫ్రెండ్‌కు కూడా కాస్తైనా టైం ఇవ్వలేదు. మా ఫ్రెండ్స్‌తో కూడా గడపలేదు. ఇవన్నీ నన్ను బాధిస్తుండేవి. సడన్‌గా ఒకరోజు నాకు నేనే రియలైజ్ అయ్యాను. ఇలా బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దని పద్ధతి మార్చుకున్నాను. కుటుంబసభ్యులతో పాటు నా జీవితంలో ఉన్న అందరికీ సమయం కేటాయిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.
ప్రేమలో..
కాగా విజయ్ దేవరకొండ.. హీరోయిన్ రష్మిక మందన్నాతో చాలాకాలంగా ప్రేమలో ఉన్నాడు. చాలాసార్లు తాను సింగిల్ కాదని హింటిచ్చాడు. విజయ్, రష్మిక.. ఛాన్స్ దొరికినప్పుడల్లా వెకేషన్‌కు చెక్కేస్తుంటారు. వీరిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు.
చదవండి: తరచు బరువు తగ్గి, పెరగడం వెనుక కారణం అదే..: విద్యా బాలన్