Vijay Devarakonda: లైగర్‌ కోసం నా సర్వస్వం ఇచ్చేశా.. అవి తిని విరక్తి వచ్చేసింది

Vijay Devarakonda Speech At Liger Press Meet At Hyderabad - Sakshi

‘‘నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ సినిమా ‘లైగర్‌’. ఫిజికల్‌గా కూడా ఎక్కువ కష్టపడిన సినిమా ఇదే. బాడీ ట్రాన్స్‌ఫార్మ్‌ కోసం  ఏడాదిన్నర పట్టింది. పెర్ఫార్మెన్స్‌ వైజ్‌ కూడా సవాల్‌తో కూడున్న సినిమా ఇది. పూరీగారు ఇచ్చిన అద్భుతమైన కథకి న్యాయం చేసేందుకు నా సర్వస్వం ఇచ్చేశా’’ అన్నారు విజయ్‌ దేవరకొండ. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ పంచుకున్న విశేషాలు. 

నటుడిగా కెరీర్‌ ప్రారంభించక ముందు ఇండస్ట్రీలో పరిచయాలు పెరగడం కోసం తేజగారి దగ్గర సహాయ దర్శకుడిగా చేశాను. పూరి జగన్నాథ్‌గారు అయితే సహాయ      దర్శకులకు మంచి జీతం ఇస్తారని, ఆయన వద్ద చేరమని నాన్నగారు చెప్పారు. పూరీగారి ఆఫీసుకు వెళ్లాను.. కానీ, ఆయన్ని కలవడం కుదరలేదు. ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం తర్వాత కలిశాను. ‘లైగర్‌’ని తెలుగు సినిమాగానే చేద్దామనుకున్నాం. అయితే కథ మొత్తం విన్న తర్వాత దేశం మొత్తం ఈ కథ చెప్పొచ్చని అనిపించి, పాన్‌ ఇండియా సినిమాగా చేశాం.  

లైగర్‌’ హిందీ సినిమాలా కనిపిస్తోందని తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. అయితే ఇది పక్కా తెలుగు చిత్రం. మన సినిమాని (తెలుగు) ఇండియాకి చూపిస్తున్నాం. ఈ మూవీ ప్రమోషన్స్‌ కోసం ఇండియాలో ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున జనాల నుంచి ప్రేమ లభించింది. ఎప్పుడూ మరచిపోలేని అలాంటి ప్రేమ ఇక్కడి నుండే (తెలుగు నుంచే) మొదలైంది. ఆ ప్రేమ వల్లే ‘లైగర్‌’పై నమ్మ కంగా ఉన్నాం. ఆగస్ట్‌ 25న ఇండియా షేకవుతుంది. 

'లైగర్‌’లో మైక్‌ టైసన్‌గారితో యాక్షన్‌ సీన్స్‌ అన్నప్పుడు మా అమ్మ భయపడింది. ఆయన రియల్‌ ఫైటర్‌.. నటన అనుభవం లేదు. అందుకే నిజంగా కొట్టేస్తారేమో అని భయం వేసింది (నవ్వుతూ).. నా ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా చూసి, కరణ్‌ జోహార్‌గారు కాల్‌ చేసి, హిందీలో చేసే ఆలోచన ఉంటే చెప్పమన్నారు. ‘లైగర్‌’ గురించి చెప్పగానే కథ వినకుండా చేద్దామన్నారాయన. ఈ చిత్రంలో నత్తి పాత్ర చేయడానికి మొదట మూడు రోజులు కష్టపడ్డాను.

ఆ తర్వాత ఆ పాత్రతో ఒక కనెక్షన్‌ వచ్చేసింది. ‘లైగర్‌’లో పాత్ర కోసం రోజుకు ఐదారు గంటలు వర్కవుట్‌ చేయాల్సి వచ్చింది. చిన్నప్పుడు ఆదివారం వస్తే చికెన్‌ కోసం ఎదురుచూసేవాణ్ణి.. ముక్కలు సరిపోయేవి కాదు. అయితే రెండేళ్లుగా ప్రతిరోజూ మూడు పూటలు చికెన్‌ తినడం వల్ల విరక్తి వచ్చేసింది. చిన్నప్పుడు మనస్ఫూర్తిగా తిందామంటే దొరికేది కాదు.. దాన్ని గుర్తు చేసుకొని ‘ఇప్పుడు దొరికింది కదా.. తిను’ అని నాకు నేను చెప్పుకుంటూ తినేవాణ్ణి.   

అనన్యా పాండే మాట్లాడుతూ – ‘‘పూరి, ఛార్మీగార్లు ‘లైగర్‌’ కథ చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఈ సినిమాతో సౌత్‌లోకి రావడం ఆనందంగా ఉంది. మా నాన్నతో (చుంకీ పాండే) నటించాలని ఎప్పటి నుంచో ఉండేది. ఆయన మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ చేయమని చెప్పేవారు. ‘లైగర్‌’తో ఒకేసారి రెండు కోరికలు తీరడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top