పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌.. ఆయన చిత్రం సజీవం

Veteran Film Publicity Designer Eswar Rao Passes Away - Sakshi

ప్రసిద్ధ పబ్లిసిటీ డిజైనర్‌ కొసనా ఈశ్వరరావు (ఈశ్వర్‌) ఇక లేరు. మంగళవారం చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈశ్వర్‌ వయసు 84 ఏళ్ళు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు ప్రాంతం ఆయన స్వస్థలం. ప్రముఖ డిజైనర్‌ కేతా శిష్యుడిగా మొదలై, బాపు దర్శకత్వంలోని ‘సాక్షి’ (1967)తో పబ్లిసిటీ డిజైనర్‌గా ఈశ్వర్‌ శుభారంభం పలికారు. అనంతరం హిందీ చిత్రం ‘రామ్‌ ఔర్‌ శ్యామ్‌’కి పబ్లిసిటీ పనులను ‘విజయా’ విశ్వనాథ రెడ్డి  ఆయనకు అప్పగించారు.

వాటర్‌ కలర్‌లో రూపొందించిన ఈ పోస్టర్లు ఆయిల్‌ పెయింట్‌ పోస్టర్ల కన్నా బాగున్నాయని ఆ చిత్రనిర్మాతల్లో ఒకరైన బి. నాగిరెడ్డి ప్రశంసించారు. వాటిని చూసిన రామానాయుడు ‘పాపకోసం’కి ఈశ్వర్‌కు అవకాశం ఇస్తే, బ్రష్‌ వాడకుండా నైఫ్‌ వర్క్‌ చేసి వాల్‌ పోస్టర్లు రూపొందించారు. తెలుగు, తమిళ, హిందీ ‘ప్రేమనగర్‌’ సినిమా పోస్టర్ల వినూత్న సృష్టికి మంచి ప్రాచుర్యం లభించింది. అప్పటి నుంచి ఒక లైన్‌ డ్రాయింగ్‌ ఉండేలా పోస్టర్లకు కొత్తదనం తీసుకొచ్చారు ఈశ్వర్‌.

పబ్లిసిటీ డిజైనర్‌గా 40 ఏళ్ళు నిర్విరామంగా కృషి చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2600కుపైగా చిత్రాలకు పనిచేశారు ఈశ్వర్‌. విజయా, ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, సురేష్‌ ప్రొడక్షన్స్, వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్‌ వంటి అగ్ర నిర్మాణ సంస్థలకు పబ్లిసిటీ డిజైనర్‌గా చేశారాయన. కొత్తదనం కోసం పుస్తకాలూ, హిందీ పోస్టర్లూ పరిశీలిస్తూ నైపుణ్యాన్ని పెంచుకునేవారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఈశ్వర్‌ డిజైన్‌ చేశారు.

అక్షరశిల్పిగా పేరు పొందిన తన తమ్ముడు బ్రహ్మంతో కలిసి ‘జయ’ యాడ్స్‌ పేరుతో కొన్ని కన్నడ సినిమాలకు సొంతంగా పబ్లిసిటీ డిజైన్లు రూపొందించడం మొదలెట్టారు ఈశ్వర్‌. ఆ తర్వాత ‘ఈశ్వర్‌’ పేరుతోనే సొంత పబ్లిసిటీ కంపెనీకి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్‌ మీడియా రంగంలో వినియోగిస్తున్న తెలుగు అక్షరాలు (ఫాంట్‌) చాలా వరకు ఆయన తన తమ్ముడు బ్రహ్మంతో కలసి రూపొందించినవే. ఈశ్వర్‌ ఆఖరి చిత్రం ‘దేవుళ్లు’.

ఈశ్వర్‌ గీసిన చిత్రాలు సజీవం. ఆ చిత్రాల ద్వారా ఈశ్వర్‌ కూడా సజీవమే. ఈశ్వర్‌ భార్య పేరు వరలక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఈశ్వర్‌ మృతి పట్ల హీరో బాలకృష్ణ, సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత సురేశ్‌ బాబు, యువచిత్ర అధినేత మురారి, మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రాతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. బుధవారం ఉదయం చెన్నైలో ఈశ్వర్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఈశ్వర్‌ మంచి రచయిత కూడా. 2011లో ఆయన రాసిన ‘సినిమా పోస్టర్‌’కు నంది అవార్డు లభించింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను 2015లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారంతో ఈశ్వర్‌ని సత్కరించింది.


అమితాబ్‌ నుంచి నంది అవార్డు అందుకుంటూ...

అప్పటికి సినిమా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఎక్కువగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కానీ, సాంకేతిక నిపుణుల్లో ఛాయాగ్రాహకుడు యం.ఎ. రహమాన్‌ (1983) తొలిసారి ‘రఘుపతి వెంకయ్య’ పురస్కారాన్ని అందుకోగా, పబ్లిసిటీ రంగం నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి సాంకేతిక నిపుణులు ఈశ్వర్‌ కావడం విశేషం.  

ప్రముఖ తమిళ రాజకీయ
నాయకుడు అణ్ణాదురై చిత్రాన్ని గీయాల్సిందిగా ఈశ్వర్‌ ఇంటికి నాటి ముఖ్యమంత్రి కరుణానిధి వెళ్లడం ఓ విశేషం. 1970 దీపావళి పండగకు ఆరు తమిళ సినిమాలు విడుదలయితే అన్నిటికీ పబ్లిసిటీ డిజైన్లు చేసినది ఈశ్వరే. తెలుగులో అగ్రహీరోల చిత్రాలకు పని చేసిన ఈశ్వర్‌ తమిళంలో యమ్జీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, జయశంకర్, శివకుమార్‌ వంటి అగ్రశ్రేణి హీరోల సినిమాలకు పబ్లిసిటీ డిజైన్లు రూపొందించారు. ఈ అవకాశం దక్కింది ఒక్క ఈశ్వర్‌కే.

‘సౌత్‌ ఇండియన్‌ పబ్లిసిటీ డిజైనర్స్‌’ సంఘానికి ఈశ్వర్‌ పదేళ్లు అధ్యక్షులుగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈశ్వర్‌ చేత బాలాజీ నేత్రదర్శనం, అర్చనానంతర దర్శనం, పూలంగి సేవాదర్శనం చిత్రాలను వేయించి, వాటిని క్యాలండర్లుగా ప్రచురించాలనుకున్నారు. అందుకోసం కొన్ని రోజుల పాటు గర్భగుడిలో స్వామికి ఎదురుగా కూర్చుని స్కెచ్‌లు గీయడం తన జీవితంలో మరపురాని సందర్భం అనేవారు ఈశ్వర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top