
కులం కోసం కాదు... మనుషుల కోసం పోరాటం...! అనే మెసేజ్ ఇచ్చిన 'జయం మనదేరా' చిత్రానికి 25 ఏళ్లు. ఈ మూవీతో కులాల మధ్య అంతరాన్ని తగ్గించే మెసేజ్ ఓరియెంటెడ్ కథతో వెంకటేష్ మెప్పించారు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై నేటికి 25 సంవత్సరాలు పూర్తి అయింది. ఇందులో వెంకటేశ్ ద్విపాత్రాభినయంలో కనిపించగా భానుప్రియ, సౌందర్య కథానాయికలుగా నటించారు. సురేష్ ప్రొడక్షన్స్‌పై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.
2000లో విడుదలై సూపర్ డూపర్ హిట్‌గా 'జయం మనదేరా' నిలిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను పొందింది. వెంకటేష్ కెరీర్‌లో ఒక మైలురాయిగా ఈ మూవీ నిలవడమే కాకుండా.. ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో వెంకటేష్.. మహదేవ నాయుడు, అభిరాం అనే రెండు పాత్రలు పోషించారు. అప్పట్లో ఇదో మాస్ సినిమాగా ప్రేక్షకులు ఆదరించారు.

'జయం మనదేరా' మూవీ రూ. 16 కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టి 2000 సంవత్సరంలో రెండోవ అతిపెద్ద గ్రాసర్‌గా నిలిచింది. నైజాం ప్రాంతంలో ఆల్-టైమ్ మొదటి వారం రికార్డును క్రియేట్ చేయడమే కాకుండా.. చిరంజీవి నటించిన అన్నయ్య కలెక్షన్స్‌ను కూడా అధిగమించింది. అదే సంవత్సరం సంక్రాంతికి విడుదలైన (కలిసుందం రా) 18 కోట్ల షేర్‌తో ఆల్-టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. జయం మనదేరా చిత్రం 149 కేంద్రాలలో 114 ప్రింట్లతో విడుదల కాగా... 120 కేంద్రాల్లో 50 రోజులు, 33 కేంద్రాల్లో 100 రోజుల పాటు ప్రదర్శించారు. అలా 2000 సంవత్సరం వెంకటేష్‌కు ఇది గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు.
అయితే, ఈ సినిమాకు బ్రాండ్ ప్రమోషన్‌గా థమ్స్ అప్ కంపెనీ కొనసాగింది. సినిమా కోసం బ్రాండ్ ప్రమోషన్‌గా ఒక కంపెనీ నిలవడం అనేది ఇక్కడి నుంచే మొదలైంది. అందుకోసం ఆ కంపెనీ రూ.80 లక్షలు చెల్లించింది. ఆ డబ్బుతోనే ఈ సినిమా నిర్మించేందుకు కాస్త ఉపయోగపడిందని చెబుతారు. ఇది అప్పట్లో ఒక వ్యూహాత్మక నిర్ణయంగా నిలిచింది. ఈ మూవీ షూటింగ్ యూరప్‌లో 25 రోజులు కొనసాగింది. ఆపై రెండు పాటలను యునైటెడ్ స్టేట్స్‌లో చిత్రీకరించారు. ఇలా ఇతర దేశాల్లో షూటింగ్ జరగడం ఆరోజుల్లో కాస్త అరుదుగానే జరిగేది.