మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి కాస్త డిఫరెంట్ సినిమాలతో హిట్స్ అందుకున్న హీరో వరుణ్ తేజ్.. గత మూడు చిత్రాలతో దారుణంగా నిరాశపరిచాడు. చివరగా 2024లో 'మట్కా' మూవీతో వచ్చాడు. తర్వాత నుంచి పూర్తిగా కనిపించడమే మానేశాడు. అయితే హారర్ సినిమాలో నటిస్తున్నట్లు గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్ర గ్లింప్స్, టైటిల్ అనౌన్స్ చేశారు.
(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: ఏఆర్ రెహమాన్)
వరుణ్ తేజ్ కొత్త చిత్రానికి 'కొరియన్ కనకరాజు' అనే పేరు ఖరారు చేశారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా తదితర కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. రితికా నాయక్ హీరోయిన్ కాగా సత్య కీలక పాత్ర చేశారు. గ్లింప్స్ సింపుల్‌గా కామెడీగా బాగుంది.
కొరియన్ పోలీస్ స్టేషన్‌లో సత్యని కట్టేసి ఉంటే.. కత్తితో వచ్చిన వరుణ్ తేజ్, పోలీసుల్ని చంపేస్తాడు. కట్ చేస్తే అతడిని ఓ దెయ్యం ఆవహించి ఉంటుంది. మరి ఆ దెయ్యం ఎవరు? అసలు కొరియాలో వీళ్లు ఏం చేస్తున్నారనేది మూవీ చూస్తే తెలుస్తుంది. ఈ ఏడాది వేసవిలో థియేటర్లలోకి సినిమాని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: దర్శకుడు ఒత్తిడి చేసినా రిజెక్ట్ చేశా.. అందరిముందే అరిచాడు!)


