సెలబ్రిటీల జీవితం అద్దాల మేడలాంటిదంటారు. నిజమే, ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత వారిది ఆడంబర జీవితమే.. అయితే ఆ స్థాయికి ఎదిగేవరకు ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా తమ జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను చాలామంది నటీమణులు బహిరంగంగానే వెల్లడించిన సందర్భాలున్నాయి. హీరోయిన్ తమన్నా కూడా ఇందుకు అతీతం కాదు.
బాలీవుడ్‌లో బిజీ
ఒక్క పాటకు డ్యాన్స్ చేయడానికి సుమారు రూ.6 కోట్లు పారితోషికం తీసుకుంటున్న ఈ అందాల రాశి 2 దశాబ్దాలుగా పలు భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది. ముఖ్యంగా ఐటం సాంగ్స్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న తమన్నాకు ప్రస్తుతం దక్షిణాదిలో పెద్దగా అవకాశాలు లేకపోయినా హిందీలో చేతినిండా సినిమాలతో బిజీగానే ఉంది.
దర్శకుడు ఒత్తిడి
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ 20 ఏళ్ల వయసులోనే చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ఒక సినిమాలోని ఓ సీన్‌లో హీరోతో కలిసి చాలా సన్నిహితంగా నటించాలని దర్శకుడు ఒత్తిడి చేశాడంది. అయితే ఆ సీన్‌లో నటించేందుకు తనకు అసౌకర్యంగా ఉందని చెప్పి నిరాకరించానంది.
హీరోయిన్‌ను మార్చండి
దీంతో సెట్‌లో అందరూ ఉండగా హీరోయిన్‌ను మార్చండి అని ఆ దర్శకుడు గట్టిగా అరిచాడంది. అలా ఆ సన్నివేశంలో నటించాల్సిందేనని దర్శకుడు పట్టుబట్టడంతో తాను తగ్గకుండా ఏం జరిగినా పర్వాలేదు అనే నిర్ణయానికి వచ్చానని చెప్పింది. చివరకు ఆ దర్శకుడు క్షమాపణ చెప్పారంది. అయితే అది ఏ సినిమా? ఆ దర్శకుడు ఎవరు? అన్న విషయాలు మాత్రం బయటపెట్టలేదు.


