
ఫేమస్ అవడానికి ఏదైనా చేస్తారు సినీతారలు. ఒక్కసారి పాపులర్ అయ్యాక దాన్ని కాపాడుకునేందుకు కూడా చాలా కష్టపడుతుంటారు. బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ (Uorfi Javed) కూడా అదే చేసింది. చిత్రవిచిత్ర వేషధారణతో సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూ ఉండే ఈ బ్యూటీ.. మరింత అందంగా కనిపించాలని గతంలో లిప్ ఫిల్లర్స్ వేయించుకుంది. ఈ మధ్య వాటిని తీసేయించుకోవడానికి చాలా కష్టపడింది.
తిండి మానేశా..
ఆ ట్రీట్‌మెంట్ వల్ల పెదాలు, ముఖం అంతా ఉబ్బిపోయి అందవిహీనంగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన్నగా కనిపించాలని తిండి మానేశానని చెప్తోంది. ఉర్ఫీ జావెద్ మాట్లాడుతూ.. నేను చాలాసార్లు కడుపుమాడ్చుకునేదాన్ని. తిండి తినకపోయేదాన్ని. చాలా సన్నగా కనిపించాలని నానాతిప్పలు పడ్డాను. దీంతో నాలుగేళ్ల క్రితం నాకు బాడీ డిస్మార్ఫిక్ అనే వ్యాధి వచ్చింది.
నాలుగు పీసులు తినేదాన్నంతే!
(అందంగా కనిపించడం లేదేమోనని కంగారుపడటం, శరీరంలో ఏదో ఒకటి బాగోలేదని బాధపడటం వంటివి ఈ వ్యాధి లక్షణాలు) మూడు లేదా నాలుగు చికెన్ ముక్కలు తిని రోజంతా ఖాళీ కడుపుతో ఉండేదాన్ని. వర్కవుట్స్ చేయకపోయేదాన్ని కానీ పరిగెత్తేదాన్ని. ఒంట్లో ఎక్కువ శక్తి లేకపోయేసరికి మైండ్ సరిగా పనిచేసేది కాదు. ఎప్పుడూ కోపంగా ఉండేదాన్ని, చిరాకుపడేదాన్ని. ఎవరైనా నన్ను పలకరించినా సరే నాతో ఎందుకు మాట్లాడుతున్నావ్? అనుకునేదాన్ని. .
బక్కచిక్కిపోవాల్సిన అవసరం లేదు
అయితే తర్వాత నా పద్ధతి మార్చుకున్నాను. మరీ బక్కచిక్కిపోయి స్లిమ్‌గా ఉండాల్సిన అవసరం లేదనుకున్నాను. ఈ మధ్యే జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టాను. బరువులు ఎత్తుతున్నాను. బాగా తింటున్నాను. కచ్చితంగా సన్నగా ఉండాల్సిందేనని ఏమాత్రం ఆలోచించట్లేదు అని చెప్పుకొచ్చింది. ఉర్ఫీ జావెద్.. బుల్లితెరపై పలు సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్‌లో పాల్గొంది. ఫాలో కర్లో యార్ వెబ్ సిరీస్‌లో నటించింది. ఇటీవల ద ట్రైటర్స్ ఇండియా అనే షోలో పాల్గొని విజేతగా నిలిచింది.
చదవండి: డబుల్ ధమాకా: రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. భార్య ఆరో నెల గర్భిణీ