
టైటిల్ : ఉప్పు కప్పురంబు
నటీనటులు: కీర్తి సురేశ్, సుహాస్, బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి
నిర్మాణ సంస్థ: అమెజాన్ ప్రైమ్
నిర్మాత: రాధిక లావు
కథ: వసంత్ మురళీకృష్ణ
దర్శకత్వం: ఐవీ శశి
విడుదల తేది: జులై 4, 2025
స్ట్రీమింగ్: అమెజాన్

జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్(Keerthy Suresh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu). జులై 4న డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. నటుడు సుహాస్ కీలక పాత్ర పోషించారు. సెటైరికల్ కామెడీ డ్రామాగా దర్శకులు ఐవీ శశి రూపొందించగా.. రాధికా ఎల్ నిర్మించారు. ఈ చిత్రానికి వసంత్ మురళీకృష్ణ కథని అందించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఒక గ్రామంలో శ్మశాన వాటిక కోసం ఏర్పడిన సంక్షోభాన్ని.. అక్కడి ప్రజలు ఏవిధంగా పరిష్కరించుకుంటారనే కథనంతో ఈ సినిమా సిద్ధమైంది. 1990 నాటి బ్యాక్‌డ్రాస్ స్టోరీతో వచ్చిన ఉప్పు కప్పురంబు సినిమా ఎలా ఉంది తెలుసుకుందాం.

కథేంటంటే..
‘ఉప్పు కప్పురంబు’ సినిమాకు కథను పరిచయం చేస్తూ హీరో రానా వాయిస్ ఇచ్చారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ' చిట్టి జయపురం' అనే గ్రామానికి పెద్దగా (సుబ్బరాజు) శుభలేఖ సుధాకర్ ఉంటారు. అయితే, ఆయన మరణించడంతో అతని కుమార్తె అపూర్వ (కీర్తి సురేష్) గ్రామ పెద్దగా కొనసాగుతుంది. వయసులో చిన్నపిల్ల అయిన అపూర్య గ్రామ పెద్ద ఏంటి..? అంటూ భద్రయ్య (బాబు మోహన్), మధు (శత్రు) తీవ్రంగా వ్యతిరేఖిస్తారు. అయితే, ఇక్కడ వారిద్దరు కూడా ఒకరిపైమరోకరు ఆధిపత్యం కోసం పోరాడుతూనే అపూర్వను ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అలా వారు రెండు వర్గాలుగా విడిపోయి ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. గ్రామ పెద్దగా ఉన్న అపూర్వకు ఒక సమస్య వచ్చి పడుతుంది.
గ్రామంలో ఎవరు మరణించినా వారి ఆచారం ప్రకారం ఉత్తరాన మాత్రమే పాతిపెట్టడం ఆనవాయితీగా ఉంది. చాలా ఏళ్ల నుంచి వారు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో ఆ స్మశానం నిండిపోయిందని అక్కడి కాపరిగా ఉండే చిన్న (సుహాస్) తెలుపుతాడు. అయితే, నలుగురికి మాత్రమే అక్కడ చోటు ఉందని చిన్న చెబుతాడు. ఈ సమస్యను పరిష్కరించాలని అపూర్వను కోరుతాడు. గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ నలుగురిని లాటరీ పద్ధతి ద్వారా అపూర్వ ఎంపిక చేస్తుంది. అయితే, సడెన్‌గా జరిగిన ఒక ప్రమాదంలో అదేరోజు మరో నలుగురు మరణిస్తారు. తప్పని పరిస్థితిలో వారిని అక్కడ పాతిపెట్టాక శ్మశానం హౌస్‌ఫుల్ అని బోర్డు పెట్టేస్తారు. అయితే, ఆ శ్మాశనంలో ఇంకోకరికి చోటు ఉంటుంది. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా చిన్న దాచిపెడుతాడు. అలా అతను ఎందుకు చేశాడు..? గ్రామానికి తూర్పు దిక్కున మాత్రమే శ్మశానం ఎందుకు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు..? శ్మశాన కాపరిగా ఉన్న చిన్న చేసిన మోసం వల్ల అపూర్వకు ఎదురైన చిక్కులు ఏంటి..? ఫైనల్‌గా అపూర్వ కనుగొన్న పరిష్కారం ఏంటి..? అనేది తెలియాలంటే ఉప్పు కప్పురంబు సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
1990 కాలం నాటి ప్రజలు శ్మశానంలో ఆరు అడుగుల స్థలం కోసం ఎలాంటి ఇబ్బందులు పడేవారో ఈ చిత్రంతో దర్శకుడు ఐవీ శశి చక్కగా చూపారు. ఆ రోజులకు తగ్గట్టుగానే పాత్రలను డిజైన్ చేయడమే కాకుండా కథను కూడా కాలానికి అనుగునంగా రాసుకున్నాడు. దీంతో ఓటీటీ ప్రియులకు మంచి వినోదాన్ని ఈ చిత్రం ఇస్తుంది. పరిశ్రమలోకి వచ్చే కొత్త రచయితలు, దర్శకులు ఇలా సరికొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను మెప్పించేలా మూవీ ఉంటుంది. ఇంత చిన్న పాయింట్‌తో కూడా సినిమా తీయొచ్చా..? అని మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలా చేస్తారు. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న సమస్యల్లో ఒకటి శ్మశానం. ఆ పాయింట్‌కు కాస్త వినోదం జోడించి తెరపై చూపించడంలో దర్శకుడు ఐవీ శశి విజయం సాధించారు.
ఇప్పటి వరకు కీర్తి సురేష్ గ్లామర్, డీ గ్లామర్ పాత్రలతో మెప్పించింది. అయితే ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన పాత్రలో అదరగొట్టింది. మంచి కామెడీ స్కోప్ ఉన్న పాత్రలో దుమ్మురేపింది. అపూర్వ ఊరి పెద్ద అయిన తర్వాత శ్మశానం సమస్య తెరపైకి వస్తుంది. ఏదో తాత్కాలికంగా దానిని తీర్చాం అనుకునేలోపు నలుగురు చనిపోతారు. దీంతో ఆ సమస్య మరింత తీవ్రం అవుతుంది. అలాంటి సమయంలో సుహాస్ ఒక ప్లాన్‌తో తెరపైకి వస్తాడు. ఇలా శ్మశానం చుట్టూ సమస్యలు వాటికి పరిష్కారాలు తెరపై దర్శకుడు చూపిస్తాడు. కీర్తి సురేశ్ గ్రామ పెద్దగా నటన బాగున్నప్పటికీ ఆమె పాత్రలో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి ప్రేక్షకుడికి లాజికల్‌గా అనిపించవు. ఒక సీన్‌లో అమాయకంగా కనిపించిన కీర్తి.. మరో సీన్‌లో చాలా తెలివైన అమ్మాయిగా వ్యవహరిస్తుంది. ఇలాంటి సీన్స్ కాస్త తికమకకు గురిచేస్తాయి. కొన్ని సీన్లు మరీ ఓవర్ రియాక్ట్ అయ్యేలా ఉంటాయి.
కానీ, ఆమె నటన మాత్రం అదిరిపోతుంది. సుహాస్ పాత్ర చాలా స్టేబుల్‌గానే ఉంటుంది. ఎక్కడా కూడా తడబాటు లేకుండా సెట్ చేశాడు. సినిమా మొత్తం ఎక్కువగా సుహాస్, కీర్తిల మధ్యే జరుగుతుంది. కథలో అక్కడక్కడ చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను ఆలోచింపచేస్తుంది. మిమ్మల్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్తుంది. క్లైమాక్స్‌లో ఊరి సమస్యకు పరిష్కారం కనుగొన్న తీరు కాస్త ఎమోషనల్‌గా సీన్ రాసుకోవడం బాగుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా ఓటీటీలో చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. ఇందులో కీర్తి సురేశ్ నటన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మెప్పిస్తుంది కూడా..

ఎవరెలా చేశారంటే..
ఈ మూవీలో కీర్తి సురేష్ పాత్ర చాలా బలం. అందుకు తగ్గట్లుగానే ఆమె నటించింది. ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలు అన్నీ కూడా చాలా రొటీన్‌గానే ఉంటాయి. కానీ అపూర్వ పాత్ర మాత్రం చాలా ప్రత్యేకంగా ఎప్పిటికీ నిలిచిపోతుంది. ఇందులో అమాయకంగా, క్యూట్‌గా, అల్లరి పిల్లగా, బాధ్యతగల గ్రామ పెద్దగా ఇలా పలు షేడ్స్ ఆమె నటనలో కనిపిస్తాయి. ఒక మంచి పాత్రే కీర్తికి పడింది అని చెప్పవచ్చు.కాటి కాపరి పాత్రలో సుహాస్ మెప్పించాడు. ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు.
'నిజం' సినిమాలో మహేశ్‌బాబుకు అమ్మగా నటించిన తాళ్లూరి రామేశ్వరికి ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర పడింది. ఈ మూవీతో ఆమెకు మరిన్ని ఛాన్సులు రావచ్చని చెప్పొచ్చు. బాబు మోహన్, శత్రు తమ పాత్రల మేరకు మెప్పించారు. సంగీతం, సినిమాటోగ్రాఫర్ ఈ మూవీకి బలాన్ని చేకూర్చాయి. మూవీ నిర్మాణ విలువలు బడ్జెట్‌కు మించే ఉన్నాయని చెప్పవచ్చు. 'ఉప్పు కప్పురంబు' ఓటీటీలో ఎవరినీ నిరుత్సాహపరచని సినిమాగా తప్పకుండా మిగిలిపోతుంది.