మెగాఫోన్ పట్టిన హీరోయిన్లు
స్టార్ట్ కెమెరా... యాక్షన్ అంటూ మెగాఫోన్ పట్టుకుని, కెప్టెన్ ఆఫ్ ది సినిమా బాధ్యతను స్వీకరించే లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ. ఏడాదికి ఇద్దరు... ముగ్గురు మహిళా దర్శకులు పరిచయం కావడం ఎక్కువ అనే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నలుగురైదుగురు లేడీ డైరెక్టర్స్ పరిచయం కానుండటం విశేషం. ఈ ఏడాది ఆరంభంలోనే ఒక లేడీ డైరెక్టర్ వెబ్ సిరీస్‌తో ప్రతిభను నిరూపించుకుని, ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక... 2026లో డైరెక్టర్స్‌గా సత్తా చాటుకోనున్న ‘లేడీ డైరెక్టర్స్’ గురించి తెలుసుకుందాం.
డైరెక్షన్... యాక్షన్
కథానాయికగా, ప్రతినాయికగా... ఇలా నెగటివ్, పాజిటివ్ ఏ రోల్ అయినా నటిగా తన సత్తా చాటుకున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. నటిగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నారామె. పన్నెండేళ్లకు పైగా సిల్వర్ స్క్రీన్‌పై షైన్ అవుతున్న వరలక్ష్మి ఇప్పుడు తెరవెనక డైరెక్షన్ బాధ్యతను చేపట్టారు. ‘సరస్వతి’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు వరలక్ష్మి లీడ్ రోల్‌లో నటించారు. ఇటు డైరెక్షన్ అటు యాక్షన్ మాత్రమే కాదు... తన సోదరి పూజాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు కూడా. వాస్తవ ఘటనల నేపథ్యంలో థ్రిల్లర్ మూవీగా ‘సరస్వతి’ని తెరకెక్కించారు. దోసె డైరీస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇంకా విడుదల తేదీ ఖరారు కాలేదు. జీవా, ప్రకాశ్‌రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ఎ.ఎం. ఎడ్విన్ సకాయ్.
రెండో సినిమాకే దర్శకురాలిగా...
‘బెస్ట్ కపుల్’ (2021) చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు ఫ్యాషన్ డిజైనర్ షగ్నశ్రీ వేణున్. ఆ తర్వాత ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ (2024) చిత్రంతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు షగ్న. నటిగా రెండు చిత్రాల అనుభవం ఉన్న ఆమె దర్శకురాలిగా మారారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ హీరోగా ‘హలో ఇట్స్ మీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారామె. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కూడా నటిస్తున్నారు షగ్నశ్రీ. హృదయానికి హత్తుకునే ప్రేమకథతో యువతకు కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు షగ్నశ్రీ పేర్కొన్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు కావాల్సి ఉంది.
రాకాసతో రాక
సంగీత్ శోభన్ నటించిన ‘ఒక చిన్న ఫ్యామిలీస్టోరీ (2021)’ సిరీస్‌తో రచయితగా పరిచయమై, మంచి పేరు సంపాదించుకున్నారు మానసా శర్మ. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మించిన ఈ సిరీస్ ‘జీ 5’ ఓటీటీలో 2021 నవంబరు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు వ్యూయర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో ‘బెంచ్ లైఫ్’ సిరీస్ కు దర్శకత్వం వహించే చాన్స్ మానసా శర్మకు లభించింది.
వైభవ్ నటించిన ఈ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా, మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ‘రాకాస’ చిత్రంతో ఫీచర్ ఫిల్మ్ దర్శకురాలిగా మానస పరిచయం అవుతున్నారు. మానస రైటర్‌గా పని చేసిన ‘ఒక చిన్న ఫ్యామిలీస్టోరీ’ హీరో సంగీత్ శోభన్ ఈ ‘రాకాస’ చిత్రంలోనూ హీరోగా నటిస్తుండగా, ఈ సిరీస్ నిర్మాత నిహారిక కొణిదెల కూడా ఈ చిత్ర నిర్మాణంలో అసోసియేట్ కావడం విశేషం. ఉమేష్ కుమార్ బన్సల్ ఈ సినిమాకు మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నయన్ సారిక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ కామెడీ ఫ్యాంటసీ ఫిల్మ్ ఏప్రిల్ 3న థియేటర్స్‌లో విడుదల కానుంది.
డైరెక్టర్ నేహా
రామ్‌చరణ్ హీరోగా పరిచయమైన ‘చిరుత’ సినిమాతో నేహా శర్మ కూడా హీరోయిన్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత నటిగా వీలైనప్పుడల్లా సినిమాలు చేస్తూనే ఉన్నారు. నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం 2023లో విడుదల కాగా, ఈ చిత్రంలో నటించారు నేహా. అయితే నేహా ఇప్పుడు దర్శకురాలిగా మెగాఫోన్ పట్టనున్నారు. 1945 నేపథ్యంలో సాగే ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు నేహా శర్మ దర్శకత్వం వహించనున్నారని, ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన పనులుప్రారంభమయ్యాయనే టాక్ కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్ ఈ సినిమాను నిర్మించనున్నారని సమాచారం.
⇒ హీరోయిన్ గా కీర్తీ సురేష్ ఎంత సక్సెస్‌ఫుల్లో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా, మరోవైపు ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లో మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేస్తూ కెరీర్‌ను భలే బ్యాలెన్స్ చేస్తున్నారు కీర్తి. అయితే ఇప్పుడు ఆమె దర్శకురాలిగానూ, తన కీర్తిని పెంచుకోవాలనుకుంటోంది. మెగాఫోన్ పట్టేందుకు కథలు రాస్తున్నారు కీర్తీ సురేష్. ఆమె టైటిల్ రోల్‌లో నటించిన ‘రివాల్వర్ రీటా’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా, తన దర్శకత్వ లక్ష్యాలను గురించి, కీర్తి చెప్పుకొచ్చారు. ‘‘భవిష్యత్‌లో నాకు దర్శకత్వం వహించే ఆలోచన ఉంది. గత ఐదు సంవత్సరాలుగా కొన్ని కథలను రాస్తున్నాను. ఈ కథలను డెవలప్ చేసుకునే విషయమై కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్‌తోనూ నేను మాట్లాడుతున్నాను. నా ట్రావెల్ టైమ్‌లోనూ కొత్త ఐడియాలను ఆలోచిస్తున్నాను. ఆసక్తిగా అనిపించినవాటిని నోట్ చేసుకుంటున్నాను’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు
కీర్తీ సురేష్.
ఇటీవల విడుదలైన ‘నయనం’ వెబ్‌సిరీస్ వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. వరుణ్ సందేశ్, ప్రియాంకా జైన్, ఉత్తేజ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సిరీస్‌తో స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మించగా, జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కి మంచి ఆదరణ
లభిస్తోంది.


