పల్లె కథలు, మట్టి కథలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. గత ఏడాది థియేటర్స్‌లోకి వచ్చిన నాని ‘దసరా’, సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, సందీప్ కిషన్ ‘ఊరిపేరు భైరవకోన’, కార్తికేయ ‘బెదురు లంక 2012’, ప్రియదర్శి ‘బలగం’ వంటి పూర్తి స్థాయి పల్లెటూరి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద హిట్స్‌గా నిలిచాయి. ఇటీవల హిట్స్‌గా నిలిచిన ‘ఆయ్, కమిటీ కుర్రోళ్ళు’ కూడా పల్లె కథలే. దీంతో ఓ హిట్‌ని ఖాతాలో వేసుకోవడానికి పల్లెకు పోదాం చలో... చలో అంటూ కొందరు హీరోలు పల్లె కథలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇక ఏయే హీరోలను పల్లె పిలిచిందో తెలుసుకుందాం.
పల్లె ఆట
రామ్‌చరణ్ కెరీర్‌లోని పర్ఫెక్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్ ‘రంగస్థలం’. 2018లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ‘రంగస్థలం’కు దర్శకత్వం వహించిన సుకుమార్ వద్ద ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన బుచ్చిబాబు సాన ఇప్పుడు రామ్‌చరణ్‌తో సినిమా చేసేందుకు ఓ పల్లెటూరి కథను రెడీ చేశారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలిసింది.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ సినిమాలో రామ్‌చరణ్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా మేకోవర్ పనులతో బిజీగా ఉన్నారు రామ్‌చరణ్. కథ రీత్యా పాత్ర కోసం బరువు పెరుగుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. స్పెషల్ డైట్ ఫాలో అవుతున్నారు. దసరా తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న చిత్రం ఇది. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.
తెలంగాణ కుర్రాడు
తెలంగాణ పల్లెటూరి అబ్బాయిలా హీరో శర్వానంద్‌ను రెడీ చేస్తున్నారు దర్శకుడు సంపత్ నంది. వీరి కాంబినేషన్‌లో ఓ పల్లె కథ తెరకెక్కనుంది. కేకే రాధామోహన్ నిర్మిస్తారు. యాక్షన్, ఎమోషన్ ప్రధానాంశాలుగా ఈ చిత్రం 1960 కాలంలో సాగుతుంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెలంగాణ–మహారాష్ట్రల సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో కథనం ఉంటుంది. శర్వానంద్ కెరీర్‌లోని ఈ 38వ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా లుక్‌కు సంబంధించిన మేకోవర్ పనుల్లో ఉన్నారు శర్వానంద్. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తారు.
బచ్చల మల్లి కథ
వీలైనప్పుడల్లా సీరియస్ కథల్లోనూ నటిస్తుంటారు హీరో ‘అల్లరి’ నరేశ్. అలా ఆయన టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. 1990 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మేజర్ సన్నివేశాలు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో దొంగగా పేరుగాంచిన బచ్చలమల్లి అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు.
పల్లె బాటలో తొలిసారి...
హీరో విజయ్ దేవరకొండ పల్లెటూరి బాట పట్టారు. కెరీర్‌లో తొలిసారిగా పల్లెటూరి కుర్రాడిగా సెట్స్‌కు వెళ్లనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘రాజావారు రాణివారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. పక్కా పల్లెటూరి యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్ చిత్రీకరణ ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా సెట్స్‌లోకి అడుగుపెడతారు విజయ్ దేవరకొండ.
పల్లెటూరి పోలీస్
పల్లెటూరి రాజకీయాల్లో విశ్వక్ సేన్ జోక్యం చేసుకుంటున్నారు. విశ్వక్ సేన్ హీరోగా ఓ విలేజ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ తెరకెక్కనుంది. విశ్వక్ కెరీర్‌లోని ఈ 13వ సినిమాతో శ్రీధర్ గంటా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ సంపద హీరోయిన్‌గా కనిపిస్తారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. విశ్వక్ కెరీర్‌లో పూర్తి స్థాయి విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉండబోతోందని ఫిల్మ్‌నగర్ సమాచారం.
అమ్మాయి కథ
యాక్షన్... లవ్‌స్టోరీ... పొలిటికల్... ఇవేవీ కాదు... భార్యాభర్తల అనుబంధం, స్త్రీ సాధికారత వంటి అంశాలతో సరికొత్తగా ఓ సినిమా చేస్తున్నారు తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్‌తో పాటు ఈషా రెబ్బా మరో లీడ్ రోల్‌లో కనిపిస్తారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాను సంజీవ్ ఏఆర్ దర్శకత్వంలో సృజన్ యరబోలు, వివేక్ కృష్ణ, సాధిక్, ఆదిత్య పిట్టీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.
త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత రానుంది. కాగా మలయాళ సూపర్ హిట్ ‘జయ జయ జయ జయ హే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందిందనే టాక్ వినిపిస్తోంది. కాలేజ్ సమయంలో ప్రేమించి, మోస΄ోయిన ఓ అమ్మాయి వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అత్తింట్లో కొత్త సమస్యలు ఎదుర్కొంటుంది. ఆ తర్వాత భర్తకు ఎదురు తిరిగి, సొంతంగా వ్యాపారం పెట్టుకుని జీవితాన్ని ఎలా లీడ్ చేస్తుంది? అనే అంశాలతో ‘జయ జయ జయ జయ హే’ సినిమా కథనం సాగుతుంది.
పోస్ట్‌మ్యాన్ స్టోరీ
‘క’ అనే ఓ డిఫరెంట్ టైటిల్‌తో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా కిరణ్ అబ్బవరం ఓ సినిమా చేశారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఓ గ్రామంలో సాగే ఈ సినిమా కథలో కిరణ్ అబ్బవరం పోస్ట్‌మ్యాన్ రోల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే హీరో క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో స్పష్టత రానుంది. ఇలా పల్లెటూరి కథలతో రూపొందుతున్న చిత్రాలు మరికొన్ని ఉన్నాయి.
– ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment