
టాలీవుడ్లో నెలకొన్న సినీ కార్మికుల వేతనాల సమస్యపై చిన్న సినిమాల నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ పట్ల తమ అభిప్రాయాలను వెల్లడించారు. నిర్మాతలకు సైతం పేమేంట్స్ సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన ఈ సమావేశంలో నిర్మాతలు ఎస్కేఎన్, రాజేశ్ దండా, మధుర శ్రీధర్, చైతన్య రెడ్డి, శరత్ చంద్ర, ధీరజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ..' అందరూ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. మేము నిర్మాతల బాధ్యతల గురించి మాట్లాడతాం. నిర్మాతల సమస్యల గురించి చెప్పటం లేదు. నిర్మాతలకు ఎవరితో ఎప్పుడు ఎలా పని చేయాలనే ఆప్షన్ ఉండాలి. వేతనాలు యాభై శాతం పెంచుదాం.. కానీ మా సినిమాల పెట్టుబడికి తగిన బిజినెస్ ఎవరు చేస్తారు. థియేటర్లకు ప్రేక్షకులను ఎవరు రప్పిస్తారు? మా సినిమా బడ్జెట్లకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? చిన్న సినిమాలకు సరైన బిజినెస్ అవటం లేదు.. అయినా రెండు వేల లోపు వేతనాలు తీసుకునే కార్మికులకు పెంచుతామన్నాం. టికెట్ రేట్ల పెంపు అనేది కేవలం పెద్ద సినిమాలకే.. అవీ ఏడాదికి పది మాత్రమే వస్తాయి. మిగిలిన 200 చిన్న సినిమాలకు టికెట్ రేట్లు వర్తించవు.. ఇండస్ట్రీ బాగుంటేనే అందరు బాగుంటారు. కానీ ఇండస్ట్రీలో నలిగిపోతున్న నిర్మాత పక్కన ఎవరు నిలబడరు. హక్కుల గురించి మాట్లాడేవారు.. బాధ్యతల గురించి కూడా చర్చించాలి' అని అన్నారు.
నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ..' నిర్మాతలకు కూడా రావాల్సిన పేమేంట్స్ ఉంటాయి.. కానీ కార్మికుల వేతనాలు ఏరోజు వేతనాలు ఆ రోజే ఇవ్వాలని , 30 శాతం పెంచాలంటున్నారు. ఓటీటీలు సైతం డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయి. నా గత సినిమాకు 250 వర్కర్స్ రావాల్సినా అంత మంది రాలేదు.. అప్పుడు ఫెడరేషన్ రెస్పాండ్ అవ్వలేదు..' అని అన్నారు.

నిర్మాత చైతన్య రెడ్డి మాట్లాడుతూ..'మాకు నచ్చిన వారిని ఎందుకు మేము పెట్టుకోకూడదు.. సినీ ఎంప్లాయిస్కు నిర్మాతలు పని కల్పిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్దితుల్లో వేతనపెంపు భారమే. ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాపారం సరిగ్గా నడవటం లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకోవాల్సిన అవసరం ఉంది. ఏ నిర్మాతకు సినిమాల వల్ల డబ్బులు సంపాదించటం లేదు. ఎవరు హ్యాపీగా లాభాల్లో లేరు.. కేవలం సినిమా మీద ప్యాషన్తోనే పని చేస్తున్నాం. బాహుబలి , పుష్ప , హనుమాను లాంటి గొప్ప సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్నాయి. కానీ నిర్మాతల పరిస్థితి కూడా కార్మికులకు తెలుసు. మా పరిస్థితిని అందరూ అర్దం చేసుకుంటారని ఆశిస్తున్నాం.' అని అన్నారు.