సవాల్‌కి సై | Sakshi
Sakshi News home page

సవాల్‌కి సై

Published Sun, Oct 18 2020 2:22 AM

Tollywood actresses are trained in martial arts And Other Activites - Sakshi

కథని బట్టి కథలోని పాత్రను బట్టి నటీనటులకు కసరత్తు ఉంటుంది. కొన్ని అవలీలగా చేసేవి ఉంటాయి. కొన్ని కష్టపడి చేసేవి ఉంటాయి. కొన్నింటికి శారీరక శ్రమ ఉంటుంది. మరికొన్నింటికి మానసిక శ్రమ. ఏ పాత్రకు సంబంధించిన కష్టం దానికి ఉంటుంది. పాత్ర ఎంత ఛాలెంజ్‌ చేస్తే అంత శ్రమిస్తారు. ప్రస్తుతం కొన్ని పాత్రల కోసం కొందరు హీరోయిన్లు శారీరకంగా శ్రమిస్తున్నారు. కొత్త విద్యలు నేర్చుకుంటున్నారు. కొత్త టెక్నిక్‌లు సాధన చేస్తున్నారు. సుకుమారి భామలు చేస్తున్న కఠోర కసరత్తులు గురించి తెలుసుకుందాం.

‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా శంకర్‌–కమల్‌హాసన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘భారతీయుడు 2’. కమల్‌హాసన్‌కు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించనున్నారు కాజల్‌. ఈ సినిమా కోసం ప్రాచీన యుద్ధ విద్య కళరి పయ్యట్టు నేర్చుకుంటున్నారామె. ఇందులో ఆమె పలు ఫైట్‌ సన్నివేశాల్లో కూడా కనిపిస్తారట. సందీప్‌ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. ఇందులో ఈ ఇద్దరూ హాకీ ప్లేయర్స్‌ పాత్రలో కనిపించనున్నారు.

హాకీ ప్లేయర్‌గా కనిపించడానికి చిత్రీకరణ ప్రారంభం అయ్యే ముందు కొన్నిరోజుల పాటు హాకీ నేర్చుకున్నారు లావణ్యా త్రిపాఠి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘సీటీమార్‌’ సినిమా కోసం తమన్నా కబడ్డీ మెళకువలు తెలుసుకున్నారు. గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ ‘సీటీమార్‌’. ఇందులో కబడ్డీ కోచ్‌ పాత్రలో తమన్నా కనిపించనున్నారు. ‘రష్మీ రాకెట్‌’ అనే స్పోర్ట్స్‌ సినిమా చేస్తున్నారు తాప్సీ. ఈ సినిమాలో రన్నర్‌ పాత్రలో కనిపించనున్నారామె. ఇందుకోసం తన డైట్‌ని మొత్తం మార్చేశారు తాప్సీ. రన్నర్‌ లుక్‌ కోసం, రన్నర్‌గా మారడానికి ఫిట్‌నెస్‌ మీద మరింత దృష్టిపెట్టారామె.

మరింత చురుకుగా పరిగెత్తడం నేర్చుకుంటున్నారట. ‘తేజస్‌’ అనే హిందీ సినిమాలో పైలట్‌గా కనిపించనున్నారు కంగనా రనౌత్‌. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ మీద దృష్టిపెట్టారు. త్వరలోనే పైలట్‌ ట్రైనింగ్‌ తరగతులకు కూడా హాజరు కానున్నారట. వచ్చే ఏడాది సూపర్‌ హీరోయిన్‌గా మారనున్నారు కత్రినా కైఫ్‌. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో కత్రినా ఓ సూపర్‌ హీరోయిన్‌ మూవీ చేయనున్నారు. ఇందులో భారీ యాక్షన్‌ ఉంటుందట. ఇందుకోసం ఆమె శిక్షణ కూడా మొదలెట్టారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. చాలావరకు గ్లామరస్‌ రోల్స్‌ చేసే కథానాయికలు అవకాశం వచ్చినప్పుడల్లా ‘యాక్షన్‌’ పాత్రల్లో రెచ్చిపోతుంటారు. ఎంతైనా కష్టపడతారు. వీళ్లంతా ప్రేక్షకుల మెప్పు పొంది, ఫుల్‌ మార్కులతో పాస్‌ అవ్వాలని కోరుకుందాం.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement